Virat Kohli: ఎన్నికల ప్రచారానికి 'కోహ్లీ'.. జనాలను ఫూల్స్ చేసిన నేత!

  • హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి
  • ‘కోహ్లీ’ దూప్ తో ప్రచారం
  • సోషల్ మీడియాలో వైరల్

రాజకీయ నాయకుల హామీలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందనడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న వ్యక్తి త్వరలో నిర్వహించే ర్యాలీకి టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని తీసుకొస్తానని జనాలకు హామీ ఇచ్చేశాడు. ఆయన హామీతో ప్రత్యర్థులకు దిమ్మదిరిగిపోయింది. ఇక ఊర్లోని జనాలైతే ఒకటే హడావుడి. అభిమానుల సందడి మొదలైంది. కోహ్లీతో సెల్ఫీలు దిగేందుకు కొందరు కెమెరాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ర్యాలీలో కోహ్లీ పాల్గొంటున్నాడని పేర్కొంటూ, అతడిని ఆహ్వానిస్తూ బ్యానర్లు వెలిశాయి.

కోహ్లీ వస్తాడన్న రోజు రానే వచ్చింది. అందరూ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లతో సిద్ధమయ్యారు. అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఉత్సాహంగా బయలుదేరారు. అనుకున్నట్టే కోహ్లీ వచ్చాడు. కొందరు అతడితో సెల్ఫీలు తీసుకున్నారు. ఇంకొందరు మాటలు కలిపారు. మెడనొప్పితో బాధపడుతూ కూడా ప్రచారానికి వచ్చినందుకు కొందరు థ్యాంక్స్ చెప్పారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.

ఇంకొందరు అభిమానులకు మాత్రం ఎక్కడో తేడా అనిపించింది. అతడు ఒరిజినల్ కోహ్లీ కాదని పట్టేశారు. ఓ అభిమాని అతడి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే, ఈ విషయం వైరల్ అయిపోయింది. కోహ్లీ పేరుతో జనాల్ని ఫూల్స్ చేసిన నేతను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మహారాష్ట్రలోని రామ్‌లింగా పంచాయతీ ఎన్నికల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్‌గా బరిలోకి దిగిన విఠల్ ఈ హామీ ఇచ్చి నెరవేర్చాడు. కాకపోతే డూప్లికేట్ కోహ్లీతో.

More Telugu News