Rajnath singh: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోవడం బాధాకరమే: రాజ్‌నాథ్ సింగ్

  • చంద్రబాబు వెళ్లిపోవడంతో ఆశ్చర్యపోయా
  • ప్రతిపక్షాలు ఒక్కటి కావడం మంచిదే
  • 2019లో మాదే విజయం

ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లిపోవడం బాధాకరమైన విషయమేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీడీపీ అలా చేసి ఉండాల్సింది కాదన్నారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు వైదొలగడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. బీజేపీ తీరుతో కూటమిలోని పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయని, వాజ్‌పేయి హయాంలో ఇలా లేదు కదా..? అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఆయా పార్టీలపై కొన్ని ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందని, అయితే, అవేమంత పెద్దవి కాదని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబంలోనూ ఇటువంటి సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు చేతులు కలుపుతుండడంపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. వారంతా ఒక్కటి కావడం వల్ల తమకొచ్చే నష్టం ఏమీ లేదన్నారు. వాళ్ల పోరాటం వారు చేసుకోవచ్చని, అయినా, ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం కూడా అవసరమని స్పష్టం చేశారు. అయితే, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం మాత్రం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News