sterilite plant: స్టెరిలైట్ ప్లాంట్ కు సమీపంలో ఉన్న గ్రామంలో.. ప్రతి ఇంట్లో ఓ క్యాన్సర్ పేషెంట్!

  • స్టెరిలైట్ ప్లాంట్ కు 3 కిలోమీటర్ల దూరంలో సిల్వర్ పురం గ్రామం
  • ప్లాంట్ వ్యర్థాలతో విషపూరితంగా మారిన భూగర్భ జలాలు
  • గ్రామస్తులను కబళిస్తున్న క్యాన్సర్ భూతం

తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణను అడ్డుకోవడానికి అక్కడి ప్రజలు ప్రాణాలను సైతం పణంగా ఎందుకు పెట్టారో ఇది చదివితే అర్థమవుతుంది. ప్లాంట్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్వర్ పురం గ్రామంలో ప్రతి ఇంట్లో ఓ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడంటే ఎలాంటివారికైనా ఆవేదన కలుగకమానదు. మూడేళ్ల క్రితం రామలక్ష్మి అనే 31 ఏళ్ల మహిళ భర్త మురుగన్ పేగు క్యాన్సర్ తో మరణించాడు. ఇప్పుడు ఆమె కూడా చావు కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థితిలో నెలకు రూ. 2,500 సంపాదించే ఆమెకు స్కూలుకు వెళుతున్న ఇద్దరు పిల్లలను పోషించడం సాధ్యం కావడం లేదు. రామలక్ష్మి కుమారుడికి పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరిక ఉంది. కూతురుకు ఏం కావాలి అని ఆలోచించే వయసు కూడా రాలేదు.

రామలక్ష్మి ఇంటి పక్కనున్న మరో ఇంట్లో మీరా అనే మహిళ ఉంటోంది. ఆమె భర్త సుబ్బయ్య కూడా ఇటీవలే లివర్ క్యాన్సర్ తో మరణించాడు. ఆమె వద్ద ఉన్న డబ్బులన్నీ భర్త ట్రీట్ మెంట్ కే ఖర్చయిపోయాయి. కుటుంబాన్ని పోషించడం కోసం మీరా కుమారుడు బలవంతంగా స్కూల్ మానేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ బాలుడు ట్రక్ క్లీనర్ గా పని చేస్తున్నాడు. అయితే, తన కుమార్తెను మాత్రం మీరా ఎలాగోలా స్కూలుకు పంపుతోంది. ఈ గ్రామంలో ఏ గడప తొక్కినా ఇలాంటి దీన గాధలే వినిస్తాయి.

సిల్వర్ పురం గ్రామంలో 2వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా కూడా స్టెరిటైట్ కంపెనీ వల్లే తమ బతుకులు నాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టెస్టుల్లో తేలిన నిజాలు విస్తుపరుస్తున్నాయి. ప్లాంట్ వదులుతున్న వ్యర్థాల్లో లెడ్ లాంటి హానికారకాలు 39 నుంచి 55 రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. గత రెండేళ్లుగా ఈ ప్లాంటు డంప్ చేస్తున్న వ్యర్థాల్లో జిప్సంలాంటివి ఉన్నాయి. ఇవి భూగర్భజలాలను విషంగా మారుస్తున్నాయి. ఈ విష జలాలే ఇక్కడి ప్రజల జీవితాలను సర్వనాశం చేస్తున్నాయి. క్యాన్సర్ మహమ్మారి పంజా విసిరేందుకు కారణమవుతున్నాయి.

More Telugu News