రాజకీయాల్లో ఈ మధ్య ఓ కొత్త ట్రెండ్ మొదలైంది: చంద్రబాబు

28-05-2018 Mon 08:41
  • ప్రత్యర్థులపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు
  • విలువల గురించి బీజేపీ మాట్లాడడం హాస్యాస్పదం
  • వైసీపీలోకి వెళ్లిపోయే నేతను అధ్యక్షుడిని చేశారు

ఈ మధ్య రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు అధికార బీజేపీ.. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను ఉసిగొల్పి ప్రత్యర్థులను భయపెట్టడాన్ని అలవాటుగా మార్చుకుందని ఆరోపించారు. ప్రత్యర్థులను నిర్వీర్యం చేసేందుకు ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారని అన్నారు. అదే సమయంలో బీజేపీ మాత్రం ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చుపెడుతోందని, ప్రశ్నించిన వారిపైకి ఇతరులను రెచ్చగొడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కర్నూలులో బీజేపీ చేసిన రాయలసీమ డిక్లరేషన్ ఈ కోవకు చెందినదేనని అన్నారు.

రాజకీయాలను బీజేపీ పూర్తిగా కలుషితం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకలో అధికారం కోసం ఎమ్మెల్యేలతో బేరాలు ఆడుతూ దొరికిపోయిన వారు విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీలోకి వెళ్లిపోయే నేతను అధ్యక్షుడిని చేసి మాట్లాడిస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చిన కేంద్రం గుజరాత్‌లో ఓ విగ్రహానికి మాత్రం రూ.3 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఢిల్లీ-ముంబై కారిడార్‌కు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం ఏపీ, తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, మందబలం ఉందని రాష్ట్రాలను నియంత్రించాలనుకోవడం ఎల్లవేళలా కుదరని పని అని చంద్రబాబు తేల్చి చెప్పారు.