మోదీ మన ప్రధాని.. ఏమిటీ దౌర్భాగ్యం?: నిప్పులు చెరిగిన చంద్రబాబు

28-05-2018 Mon 06:40
  • మోదీ మాటల ప్రధాని
  • బ్యాంకులను దివాలా తీయించారు
  • ప్రక్షాళన జరుగుతుందనే నాడు నోట్ల రద్దుకు సహకరించా

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాని కావడం ప్రజల దౌర్భాగ్యమన్నారు. మోదీ మాటల ప్రధాని తప్పితే చేతల ప్రధాని కాదని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో బీజేపీ చేసిన దానికంటే తామే ఎక్కువ చేశామని, ఈ విషయంలో చర్చకు కూడా తాము సిద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 68 శాతం మంది మోదీకి వ్యతిరేకంగా ఉన్నారని ఓ సర్వేలో తేలిందని, అది వంద శాతానికి చేరాలని అన్నారు.

ఈ నాలుగేళ్లలో మోదీ బ్యాంకులను దివాలా తీయించారని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని, జనధన్, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ ఊదరగొట్టి పక్కన పడేశారని విమర్శించారు. అవినీతి ప్రక్షాళన జరుగుతుందన్న ఆశతో పెద్ద నోట్ల రద్దుకు తాను కూడా సహకరించానని, కానీ ఆ పేరుతో మొత్తం బ్యాంకులపై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ఎగవేతలు పెరిగాయన్నారు. నగదు కొరత ప్రజలను వేధిస్తోందని, ఏమిటీ దౌర్భాగ్యమని ప్రశ్నించారు. కేంద్ర పథకాల వల్ల బాగుపడిన వారు ఒక్కరు కూడా లేరని చంద్రబాబు పేర్కొన్నారు.