Chennai: ఐపీఎల్ విజేత చెన్నై.. ఒంటి చేత్తో గెలిపించిన వాట్సన్!

  • రెచ్చిపోయిన వాట్సన్
  • 51 బంతుల్లో సెంచరీ
  • చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు
  • చెన్నైకి మూడో ఐపీఎల్ టైటిల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2018 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత ఆటతీరుతో ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీ బాది ఒంటి చేత్తో చెన్నైకి ట్రోఫీ అందించాడు. చెన్నైకి ఇది మూడో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం.

చేజింగ్‌ సెంటిమెంట్ వెంటాడుతున్నప్పటికీ జట్టు బ్యాటింగ్‌పై నమ్మకముంచిన చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి హైదరాబాద్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. రెండో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ శ్రీవత్స్ గోస్వామి (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్ ఆ తర్వాత నిలదొక్కుకుంది. మరో ఓపెనర్ శిఖర్ ధవన్‌తో కలిసిన కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. షకీబల్ హసన్, యూసుఫ్ పఠాన్‌, చివర్లో బ్రాత్‌వైట్ రాణించడంతో  హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

అనంతరం 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైని తొలి ఓవర్‌లోనే హైదరాబాద్ భయపెట్టింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్‌లో చెన్నై ఖాతా తెరవలేకపోయింది. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్‌లో మాత్రం  5 పరుగులు రాబట్టుకున్న చెన్నై నాలుగో ఓవర్ చివరి బంతికి  డుప్లెసిస్ (10) వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి చెన్నై స్కోరు 16 పరుగులు మాత్రమే. దీంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. మరోవైపు హైదరాబాద్ శిబిరంలో కేరింతలు మొదలయ్యాయి.

అయితే, వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మరో ఓపెనర్ షేన్ వాట్సన్ బ్యాట్‌ను ఝళిపించడం మొదలుపెట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న రైనా కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో పరుగుల వాన మొదలైంది. దీంతో వార్ వన్ సైడ్ అయింది. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై తిరిగి 133 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిందంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

రైనా అవుటైన తర్వాత కూడా వాట్సన్ బాదుడు ఆగలేదు. బంతి వేయడమే పాపమన్నట్టు బౌండరీలకు తరలిస్తూ హైదరాబాద్ ఆశలను నీరు గార్చాడు. బౌలింగ్‌లో బలమని చెప్పుకునే హైదరాబాద్ బౌలర్లను చీల్చి చెండాడు. చివరికి రషీద్ ఖాన్‌ను కూడా వదల్లేదు. ఈ క్రమంలో 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వాట్సన్‌కు ఇది మూడో సెంచరీ. మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న వాట్సన్ 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 117 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుకు ట్రోఫీ అందించాడు.

చివర్లో అంబటి రాయుడు (16) విన్నింగ్ షాట్ కొట్టి జట్టుకు అపూర్వ విజయాన్ని సాధించిపెట్టాడు. మరో 9 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న చెన్నై టైటిల్ విజేతగా అవతరించింది. సెంచరీతో అదరగొట్టిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News