Vijayawada: వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా: సీఎం చంద్రబాబు

  • వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల
  • కలుషిత రాజకీయాలతో కేంద్రం ముందుకెళ్తోంది
  • దక్షిణాదిలో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది
  • బీజేపీకి అభివృద్ధిపై ధ్యాస లేదు

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలో ‘మహానాడు’ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ, 2019లో కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీ, దేశం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చిన విషయాన్ని గమనించాలని అన్నారు. కలుషిత రాజకీయాలతో కేంద్రం ముందుకెళ్తోందని, ఇందుకు ఉదాహరణ.. తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడమేనని అన్నారు. ప్రధాని తమిళనాడుకు వెళితే అక్కడ నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపు నిచ్చానని, ఈ  పిలుపు మేరకు అక్కడి తెలుగువారు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసిన బీజేపీ ఆటలు సాగలేదని, ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నిస్తే, ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చాయని అన్నారు. దక్షిణభారత దేశంలో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని, బీజేపీకి అధికారంపై వ్యామోహం తప్ప, అభివృద్ధిపై ధ్యాస లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడం ఖాయమని అన్నారు.

More Telugu News