kim jong un: జూన్ 12 సింగపూర్ సమావేశం కోసం చూస్తున్నా... కిమ్ తో భేటీలో మార్పు లేదు: డోనాల్డ్ ట్రంప్

  • అధికారుల స్థాయిలో చర్చలు ఫలించాయన్న ట్రంప్
  • అటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ సైతం ఇదే ప్రకటన
  • అణు నిరాయుధీకరణకు కిమ్ కట్టుబడి ఉన్నారని వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మధ్య బేటీపై నెలకొన్న మబ్బులు తొలగిపోయాయి. కిమ్ తీరు కారణంగా జూన్ 12న సింగపూర్ లో వీరిరువురు భేటీ కావడంపై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ తాజా ప్రకటనతో ఇవన్నీ తొలగిపోయినట్టయింది. జూన్ 12 నాటి సింగపూర్ సదస్సు సందర్భంగా ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తో భేటీకి సంబంధించి అన్ని విషయాలు చక్కగా నడుస్తున్నాయంటూ ట్రంప్ స్పష్టం చేశారు.

జూన్ 12న సమావేశం కోసం చూస్తున్నానని, అందులో మార్పు ఏమీ లేదన్నారు. నిజానికి గురువారమే కిమ్ తో సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించగా, రెండు రోజుల వ్యవధిలోనే ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఉత్తరకొరియా అదికారులతో చర్చలు ఫలప్రదమయ్యాయని, దీంతో 12న సమావేశం కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు.

మరోవైపు ఇద్దరు కీలక నేతల మధ్య భేటీకి వీలుగా శనివారం ఓ పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరకొరియా అధినేత కిమ్, దక్షిణ కొరియా అధినేత మూన్ జే ఇద్దరూ భేటీ అయి చర్చించారు. ఇది రెండు దేశాల సరిహద్దుల్లో చోటు చేసుకుంది. అణు నిరాయుధీకరణ, అమెరికా అధ్యక్షుడితో భేటీపై ఈ అంశంలో దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కొరియా ద్వీపకల్పాన్ని అణు రహితంగా మార్చేందుకు కిమ్ కట్టుబడి ఉన్నారని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఈ రోజు ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడితో ఏర్పాటు చేసిన భేటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

More Telugu News