TTD: శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం... మరో రెండు వారాలు ఇంతే!

  • వేసవి సెలవుల కారణంగా రద్దీ
  • జూన్ 10 వరకూ ఇదే రద్దీ ఉంటుందంటున్న టీటీడీ
  • భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
  • వెల్లడించిన జేఈఓ శ్రీనివాసరాజు

వేసవి సెలవుల రద్దీ తిరుమల కొండపై కనిపిస్తోంది. స్వామి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించిన వారికి 36 గంటల తరువాత మాత్రమే స్వామి దర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు సైతం 4 గంటల సమయం పడుతోంది.

కాలినడకన కొండకు వస్తున్న వారికి రోజుకు 20 వేల మందికి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మరో 30 వేల టోకెన్లను టైమ్ స్లాట్ విధానంలో ఇస్తున్నామని, రోజుకు 20 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. వీరు తమకు ఇచ్చిన సమయంలో క్యూలైన్ లోకి ప్రవేశిస్తే, 3 నుంచి 4 గంటల్లో దర్శనం ముగించుకునే అవకాశం ఉందని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. కనీసం రెండు వారాల పాటు, అంటే, జూన్ 10 వరకూ ఇదే తరహా రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని అన్నారు.

More Telugu News