mahanati: ‘మహానటి’లో కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు: సీఎం చంద్రబాబు

  • సహజ నటి సావిత్రి పాత్ర చేయడమంటే సాహసమే
  • అలాంటిది, ఈ సినిమాలో కీర్తి సురేశ్ బాగా నటించారు
  • సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టింది

‘మహానటి’లో కీర్తి సురేష్ పోషించిన పాత్ర చాలా అద్భుతంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొనియాడారు. అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్ లో ‘మహానటి’ చిత్ర బృందం ఈరోజు చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్రయూనిట్ ను సీఎం సన్మానించారు. సహజ నటి సావిత్రి పాత్ర చేయడమంటే సాహసమేనని, అలాంటిది, ఈ సినిమాలో కీర్తి సురేశ్ బాగా నటించారని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్..ఎన్టీఆరే, సావిత్రి..సావిత్రేనని ప్రశంసించారు. నటి సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టిందని, రెండేళ్ల పాటు అధ్యయనం చేసి ‘మహానటి’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘మహానటి’ సినిమాను చాలా చక్కగా తీసిన నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ లను అభినందించారు.

ఈ సినిమాకు పన్ను మినహాయింపు విషయమై ప్రభుత్వం పరంగా ఆలోచన చేస్తామని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రకటనతో అక్కడే ఉన్న వైజయంతి మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత అశ్వినీదత్ స్పందిస్తూ..ఈ సినిమాకు పన్ను మినహాయింపునిస్తే, ఆ మొత్తం రాజధాని నిర్మాణానికే ఇస్తామని వెల్లడించారు. కాగా, వైజయంతి మూవీస్ తరపున రూ.50 లక్షల విరాళాన్ని రాజధాని నిర్మాణం కోసం స్వప్నదత్ ప్రకటించారు.

More Telugu News