Srikakulam District: కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనడానికి పరిశోధన మొదలైంది: చంద్రబాబు

  • 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు శిక్షణ
  • ఉద్ధానం సమస్యపై ప్రత్యేక చొరవ
  • 7 మండలాల్లోని 176 గ్రామాల్లో స్క్రీనింగు

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థులని ఆదుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

"క్రానిక్ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనడానికి పరిశోధన మొదలైంది. ఉద్ధానం ప్రాంతంలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందిస్తున్నాం. గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ, సాధికార మిత్రలతో గ్రామ స్థాయి కమిటీని నియమించి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం.  

కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న వారికి దగ్గరలోనే డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యాన్ని చేరువ చేస్తున్నాం. శ్రీకాకుళం రిమ్స్‌లో 16, టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 8, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 5, పలాస సామాజిక ఆసుపత్రిలో 8, సోంపేట సామాజిక ఆసుపత్రిలో 12 డయాలిసిస్ మిషన్లను ఏర్పాటు చేశాము.

ఉద్ధానం సమస్యపై ప్రత్యేక చొరవతో కార్యక్రమాలు చేపడుతున్నాము. గత ఏడాది జనవరి నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉద్ధానం 7 మండలాల్లోని 176 గ్రామాల్లో స్క్రీనింగు నిర్వహించి 1,01,593 మందిలో రుగ్మతలను గుర్తించారు. వారిలో 13,093 మందిని కిడ్నీ సంబంధిత వ్యాధి పరీక్షలకు సిఫారసు చేశారు" అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. 

More Telugu News