నీరవ్ మోదీపై కేసు పెట్టిన మరుక్షణమే... 50 కిలోల బంగారాన్ని మాయం చేసిన అతడి సోదరుడు

26-05-2018 Sat 12:48
  • దుబాయిలో నివాసం ఉండే నీరవ్ మోదీ సోదరుడు నేహల్
  • సీబీఐ కేసు తర్వాత రిటైల్ స్టోర్ల నుంచి 50 కిలోల ఆభరణాల తరలింపు
  • నాటి నుంచి జాడ లేని నేహల్ 
  • ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడి
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి తగ్గ వాడినని నిరూపించుకున్నాడు అతడి సోదరుడు నేహల్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోదీ రుణ హామీ పత్రాలతో రూ.13,000 కోట్ల మేర మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. నీరవ్ మోదీపై సీబీఐ ఇక్కడ కేసు నమోదు చేసిన విషయం తెలిసిన వెంటనే దుబాయిలో నివాసం ఉండే అతడి సోదరుడు నేహల్ చాాలా చురుగ్గా వ్యవహరించాడు.

నీరవ్ మోదీ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి ఉంచిన ఆభరణాలను తరలించుకుపోకుండా సీబీఐ అడ్డుపడుతుందని భావించాడు. దీంతో వెంటనే ఏకంగా 50 కిలోల బంగారం ఆభరణాలతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఇక ఆ తర్వాత నుంచి నేహల్ జాడలేదు. సురక్షిత ప్రాంతానికి పారిపోయి ఉండొచ్చని ఈడీ పేర్కొంది.