Guntur District: బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతాం: బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్

  • కన్నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తాం
  • నాలుగేళ్లలో మోదీని ఢీకొట్టే ప్రతిపక్ష నేతే లేకపోయాడు!
  • టీడీపీ లాంటి వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతాం
  • టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

బీజేపీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. గుంటూరులో జరుగుతున్న ఎన్డీయే నాలుగేళ్ల విజయోత్సవ సభలో రామ్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తామని అన్నారు. కన్నాది మచ్చలేని రాజకీయ చరిత్ర అని ప్రశంసించారు. 2019లో ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా తమ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు. నాలుగేళ్లలో మోదీని ఢీకొట్టే ప్రతిపక్ష నేతే లేకపోయాడని, మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఫ్రంట్లు, టెంట్లు అంటూ కొందరు దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారని విమర్శించారు. విజయవాడలో మహానాడు ఫ్లెక్సీలన్నీ వారసత్వంతో నిండిపోయాయని, టీడీపీ లాంటి వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామని చెప్పారు. టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకశక్తిగా నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, నేడు అదే పార్టీతో చంద్రబాబు దోస్తీ కడుతున్నారని, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి విడిపోయిన టీడీపీ, ప్రత్యేక హోదా పేరిట కావాలనే దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చేస్తున్న ధర్మపోరాట దీక్షపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. చివరకు, దేవుడిపైనా టీడీపీ రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ చేస్తున్న వేర్పాటువాద రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. 

More Telugu News