ఒత్తిడి తట్టుకోలేక బోల్తా పడిన కోల్‌కతా.. ఫైనల్‌కి సన్‌రైజర్స్!

26-05-2018 Sat 07:30
  • కీలక మ్యాచ్‌లో విజృంభించిన హైదరాబాద్
  • బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించిన ఆటగాళ్లు
  • రేపు చెన్నైతో ఫైనల్ ఢీ

తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలుపెట్టి విజయం దిశగా పయనిస్తున్నట్టు అనిపించిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివర్లో ఒత్తిడి తట్టుకోలేక వికెట్లను పారేసుకుంది. ఫలితంగా కీలక మ్యాచ్‌లో బోల్తాపడి ఫైనల్ అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంది.

మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ఆటతీరుతో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అటు బ్యాట్‌తోను, ఇటు బంతితోనూ విజృంభించిన హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. రేపు ముంబైలోని వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌తో టైటిల్ పోరు జరగనుంది.

ఐపీఎల్-18 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఒకానొక దశలో 130 పరుగులు చేయడమే కష్టంగా అనిపించింది. చివర్లో రషీద్ ఖాన్ పది బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 పరుగులు చేసి జట్టు స్కోరును అమాంతం 174కు చేర్చి ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (35), శిఖర్ ధవన్ (34) అద్భుత ఆరంభం ఇచ్చారు. 56 పరుగుల వీరి భాగస్వామ్యానికి కుల్దీప్ యాదవ్ చెక్ పెట్టాడు. శిఖర్ ధవన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఆ తర్వాత మరో నాలుగు పరుగులకే కుల్దీప్ యాదవ్ మరో దెబ్బ తీశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (3)ను పెవిలియన్ పంపాడు. ఇక ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. వృద్ధిమాన్ సాహా, షకీబల్ హసన్ (28), దీపక్ హుడా (19), యూసుఫ్ పఠాన్ (3), బ్రాత్‌వైట్ (8) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. ఈ క్రమంలో సెవెన్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రషీద్ ఖాన్ వస్తూవస్తూనే బ్యాట్‌ను ఝళిపించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. పది బంతుల్లో 34 పరుగులు చేసి జట్టు స్కోరును అమాంతం పెంచేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన హైదరాబాద్, ప్రత్యర్థి ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 160 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఒకానొక దశలో 8 ఓవర్లకు 87/2తో బలంగా కనిపించిన కోల్‌కతా తర్వాత ఒత్తిడి తట్టుకోలేక విజయం ముందు బోల్తాపడింది. ఆదుకుంటాడనుకున్న రాబిన్ ఉతప్ప (2), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (8), ఆండ్రూ రస్సెల్ (3), శివమ్ మావీ (6)లు హైదరాబాద్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ దెబ్బకు విలవిల్లాడారు. నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్ ఖాన్ మూడు కీలక వికెట్లను పడగొట్టి కోల్ కతా విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 160 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.