motkupalli narasimhulu: కేసీఆర్‌తో 15 ఏళ్లు మాట్లాడకపోయినా నా బిడ్డ పెళ్లికి వచ్చాడు: మోత్కుపల్లి

  • నా పెళ్లికి ఎన్టీఆర్ ముహూర్తం పెట్టారు
  • బిడ్డ పెళ్లి దగ్గరుండి చేస్తానన్న చంద్రబాబు అసలు పెళ్లికే రాలేదు
  • గవర్నర్ పదవి ఇస్తానంటే హోదా ఉద్యమం పేరుతో ఆపలేదా?

15 ఏళ్ల నుంచి తాను కేసీఆర్‌తో మాట్లాడకపోయినా పిలవగానే తన బిడ్డ పెళ్లికి వచ్చాడని, కేసీఆర్‌ను చూస్తే తనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తున్నారని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు  మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తన పెళ్లికి ఎన్టీఆర్ ముహూర్తం పెట్టారని, విందు కూడా ఇచ్చారని గుర్తు చేసుకున్న ఆయన.. తన బిడ్డ పెళ్లిని దగ్గరుండి చేస్తానన్న చంద్రబాబు అసలు పెళ్లికే రాలేదని ఆక్షేపించారు. అదే కేసీఆర్ అయితే పిలవగానే టైముకు వచ్చి ఆశీర్వదించి వెళ్లారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ను చూస్తుంటే తనకు ఎన్టీఆరే గుర్తుకు వస్తారని, పేదోడికి, తిండికి లేనోడికి రాజ్యసభ అవకాశం ఇచ్చారని అన్నారు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా బడుగు, బలహీన వర్గాలకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు.

రేవంత్‌రెడ్డిపై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమో తనకు అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు చెబితేనే తాను కాంగ్రెస్‌లో చేరానని రేవంత్ అంటున్నాడని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా ఎందుకు సస్పెండ్ చేయలేదని చంద్రబాబును నిలదీశారు. తనకు గవర్నర్ పదవి ఇస్తానంటే హోదా ఉద్యమం నడుస్తోందని ఆపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కూడా కర్ణాటకలా అవుతుందని చంద్రబాబు అన్నారని, ఇక్కడసలు నాయకులే లేనప్పుడు ఎలా అవుతుందని, తెలంగాణలో టీడీపీ సర్వనాశనమైందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.  

More Telugu News