shares: వేతనాలివ్వలేం... కంపెనీలో వాటాలిస్తాం: ఉద్యోగులకు ఓ స్టార్టప్ కంపెనీ ఆఫర్

  • గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే ఈస్ట్ మన్ ఆటో కంపెనీ కొత్త ఐడియా
  • ప్రారంభంలో నగదు తగినంత లేదన్న కంపెనీ ఎండీ
  • దీనివల్ల ప్రతిభావంతులను సైతం ఆకర్షించొచ్చన్న ఆశాభావం

గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఈస్ట్ మన్ ఆటో అండ్ పవర్ లిమిటెడ్’ అనే కంపెనీ ఉద్యోగులకు ఓ కొత్త ఆఫర్ ఇచ్చింది. ప్రతి నెలా వేతనాలివ్వలేమని, దానికి బదులు కంపెనీలో వాటాలను ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ కింద కేటాయిస్తామని చెప్పింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ సింఘాల్ తమ దగ్గర తగినంత నగదు నిల్వలు లేవని తెలిపారు. కంపెనీ ఆరంభ సమయం కనుక ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. పూర్తి స్థాయి ఉద్యోగులు సాధారణంగా తమ వేతనంతోపాటు షేర్లను కూడా పొందుతారని, కాకపోతే మరింత ప్రతిభావంతులను పొందేందుకు దీన్ని ఉద్యోగులు అందరికీ ఇవ్వాలన్న తమ ఐడియా ఫలితమిస్తుందన్నారు సింఘాల్.

విద్యుత్ నిల్వ, సోలార్ సొల్యూషన్స్ రంగంలో ఈ సంస్థ పనిచేస్తోంది. కంపెనీ ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ కింద జారీ చేసే షేర్లను అంత తేలిగ్గా కొట్టి పడేయలేం. ఎందుకంటే కంపెనీ భవిష్యత్తులో అతిపెద్ద కంపెనీగా అవతరిస్తే ఉద్యోగుల పంట పండినట్టే. అందుకు ఉదాహరణ ఫ్లిప్ కార్ట్. ఈ సంస్థలో ఉన్నత స్థాయిలోని ఉద్యోగులకు కంపెనీ ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ కింద షేర్లను జారీ చేయగా, అమెరికాకు చెందిన వాల్ మార్ట్ కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులకు ఒకేసారి కోట్లాది రూపాయలు వచ్చిపడుతున్నాయి. ఇదొక్కటే అని కాదు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ కింద షేర్లను ఆఫర్ చేస్తుంటాయి.

More Telugu News