Aqua: కాసేపు మత్స్యకారుడిగా... చెరువులో రొయ్యలు పట్టిన వైఎస్ జగన్!

  • ఉంగుటూరులో జగన్ పాదయాత్ర
  • తమ సమస్యలు చెప్పుకున్న ఆక్వా రైతులు
  • రొయ్యలు ఎలా పట్టాలో అడిగి తెలుసుకున్న జగన్
  • ఆక్వా రైతులకు అండగా ఉంటానని హామీ

ప్రజల్లో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఈ ఉదయం ఉంగుటూరులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చెరువులోని రొయ్యలకు స్వయంగా మేత వేసిన ఆయన, కాసేపు మత్స్యకారుడిగా మారిపోయారు. వల ఎలా వేయాలో, రొయ్యలు ఎలా పట్టాలో అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తమ బాధలను జగన్ కు చెప్పుకున్న అక్కడి వారు, చేపలు, రొయ్యల ధరలు గణనీయంగా పడిపోతున్నాయని, తాము దళారుల దోపిడీకి గురవుతున్నామని వాపోయారు. టీడీపీకి చెందిన నాయకులు సిండికేట్ గా మారి తక్కువ ధరకు తమ వద్ద రొయ్యలు కొని మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వారిని ఓదారుస్తూ, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ లను నిర్మిస్తామని, గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ రొయ్యలను దాచుకోవచ్చని తెలిపారు. ఆక్వా రైతులకు ప్రస్తుతం యూనిట్ విద్యుత్ చార్జ్ రూ. 4.75 ఉండగా, దాన్ని రూ. 1.50కు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News