India: 2019 లోక్ సభ ఎన్నికల్లో బలపడనున్న కాంగ్రెస్... స్వల్ప మెజారిటీతో బయటపడనున్న ఎన్డీయే!: ఏబీపీ, సీఎస్డీఎస్ సర్వే వెల్లడించిన ఆసక్తికర విషయాలు

  • రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో పాగా వేయనున్న కాంగ్రెస్
  • 274 సీట్లకు పరిమితం కానున్న ఎన్డీయే కూటమి
  • 60 నుంచి 164 సీట్లకు పెరగనున్న యూపీఏ బలం
  • ఇతర ప్రాంతీయ పార్టీలకు 105 స్థానాలు

కర్ణాటక ఎన్నికల ప్రహసనం ముగిసింది. అత్యధిక సర్వేలు చెప్పినట్టుగానే, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, కింగ్ మేకర్ గా మారిన జేడీఎస్, కాంగ్రెస్ సాయంతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికారానికి దూరం కాలేదన్న సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి మిగిలింది. ఇక కన్నడనాట ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా ప్రజానాడి ఎలా ఉందన్న విషయమై ఏబీపీ - సీఎస్డీఎస్ ఓ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

బీజేపీకి ఓట్ షేర్ భారీగా పడిపోనుందని, ఇదే సమయంలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుంటుందని, అయినా మొగ్గు ఎన్టీయే వైపేనని తెలిపింది. దేశవ్యాప్తంగా, 19 రాష్ట్రాల్లోని 15,859 మందిని ఏప్రిల్ 22 నుంచి మే 17 మధ్య ప్రశ్నించి, వారందరి అభిప్రాయాలతో ఓ సర్వేను విడుదల చేసింది.

ఈ సర్వే వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్ లో బీజేపీకి కాంగ్రెస్ షాకివ్వడం ఖాయమని తేలింది. కాంగ్రెస్ కు 49 శాతం ఓట్లు వస్తాయని, బీజేపీ కేవలం 34 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. మూడు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈసారి పడిపోవడం ఖాయమని, లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ భారీగా లాభపడనుంది. బీజేపీ చేతుల్లో సుదీర్ఘకాలంగా ఉన్న ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్ చేతుల్లోకి రానుంది. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 45 శాతం ఓట్లు రాగా, ఈ సంవత్సరం జరగాల్సిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ షేర్ 33 శాతానికి పతనం కానుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 44 శాతం ఓట్లు వస్తాయి.

ఇదిలావుండగా, బీహార్ లో మాత్రం బీజేపీ-జేడీ (యూ) కూటమి లోక్ సభ ఎన్నికల్లో మంచి పనితీరును చూపిస్తుంది. కాంగ్రెస్ - ఆర్జేడీ కలసి పోటీ చేసినా అత్యధిక స్థానాలు బీజేపీకి లభిస్తాయి.

ఇక ఉత్తర ప్రదేశ్ లో ఎన్డీయేకు ఓట్ షేర్ 35 శాతానికి తగ్గనుండగా, ఇతర ప్రాంతీయ పార్టీల ఓట్ షేర్ 53 శాతానికి పెరగనుంది. ఈ రాష్ట్రంలో యూపీఏ ఓట్ షేర్ స్వల్పంగా పెరిగి 12 శాతం అవుతుంది. ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, మాయావతి అధినేత్రిగా ఉన్న బీఎస్పీ కలిస్తే, ప్రభంజనమే. వారికి కాంగ్రెస్ కూడా తోడైతే అది బీజేపీకి విఘాతమే.

మహారాష్ట్ర విషయానికి వస్తే, ఎన్డీయేకు 48 శాతం, యూపీఏకు 40 శాతం ఓట్లు వస్తాయి. ఇక్కడ చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రస్తుతం బీజేపీపై అసంతృప్తిగా ఉన్న శివసేన ఎన్డీయే నుంచి వైదొలగితే మాత్రం బీజేపీకి కష్టమే.

గుజరాత్ లో ప్రజానాడిని పరిశీలిస్తే, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి బలం తగ్గి, ఆ మేరకు ఓట్లు కాంగ్రెస్ ఖాతాలోకి రానున్నాయి. అయినప్పటికీ బీజేపీకే అధిక ఓట్లు పడతాయి. ఈ రాష్ట్రంలో బీజేపీకి 54 శాతం, కాంగ్రెస్ కు 42 శాతం ఓట్లు పడొచ్చు.

పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, తృణమూల్ కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తుంది. తృణమూల్ కు 44 శాతం ఓట్ల వాటా గ్యారెంటీ. ఇదే సమయంలో బీజేపీ స్వల్పంగా లాభపడి 24 శాతం ఓట్లను తెచ్చుకోగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక తూర్పు రాష్ట్రాలకు వస్తే, ఈ ప్రాంతంలోని మొత్తం 142 ఎంపీ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, ఎన్డీయేకు 86 నుంచి 94 సీట్లు, యూపీఏకు 22 నుంచి 26 సీట్లు, ఇతరులకు 26 నుంచి 30 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.

చివరిగా పశ్చిమ మధ్య భారత్ లోని ప్రాంతాల్లో యూపీఏ కన్నా ఎన్డీయే వైపే మొగ్గు ఉంది. మొత్తం మీద 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే  కూటమి బలం తగ్గి 274 స్థానాలకు పరిమితం కానుండగా, యూపీఏ 60 సీట్ల నుంచి 164 సీట్లకు తన బలాన్ని పెంచుకోనుంది. ఇతర పార్టీలు 105 సీట్లలో విజయం సాధించనున్నాయి.

More Telugu News