Hyderabad: ప్రియుడి కోసం పాట్లు.. వైద్యురాలిగా నమ్మించే ప్రయత్నంలో కటకటాలపాలైన మహిళ!

  • ప్రియుడి కోసం వైద్యురాలి అవతారం
  • ఏప్రాన్, స్టెతస్కోప్ కొనుగోలు
  • అనుమానంతో నిలదీసిన ‘గాంధీ’ సిబ్బంది

తాను వైద్యురాలినని ప్రియుడిని నమ్మించే ప్రయత్నంలో ఓ ప్రేమికురాలు బోల్తా పడింది. వేషం వికటించడంతో పోలీసులకు చిక్కింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన రిజ్వానాబేగం (32) భర్తతో విడాకులు తీసుకుని సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉంటోంది. ఈ క్రమంలో స్థానికంగా నివసించే అబ్దుల్ కరీంతో ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు వెళ్లింది.

తాను డాక్టర్‌నని, గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ప్రియుడి బంధువు ఒకామె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. గాంధీలోనే తన ప్రియురాలు పనిచేస్తుండడంతో బాధితురాలికి సాయం చేయాలని, దగ్గరుండి చూసుకోవాలని ప్రియురాలు రిజ్వానాను కరీం కోరాడు.

సరేనన్న రిజ్వానా ఓ ఏప్రాన్, స్టెతస్కోప్ కొనుగోలు చేసి నాటకానికి తెరదీసింది. వాటిని పట్టుకుని రెండు రోజులుగా గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లి వస్తోంది. సిబ్బంది ప్రశ్నించిన ప్రతిసారీ ఏప్రాన్, స్టెతస్కోప్‌లను చూపిస్తూ తప్పించుకుంది.

గురువారం ఏకంగా తన ప్రియుడు కరీంతోపాటు అతడి మిత్రుడు మొయినుద్దీన్‌లను తీసుకుని ఆసుపత్రి ఐసీయూకు చేరుకుంది. అక్కడి సిబ్బంది వారిని నిలువరించడంతో తాను ఇక్కడే వైద్యురాలిగా పనిచేస్తున్నానని చెబుతూ చేతిలోని ఏప్రాన్, స్టెతస్కోప్‌లను రిజ్వానా చూపించింది. అయినా నమ్మని సిబ్బంది గుర్తింపు కార్డు చూపించమంటే ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పింది. దీంతో వారిని తీసుకెళ్లి పీఐసీయూ వార్డులో ఆరా తీయగా ఆమె ఎవరో తెలియదని చెప్పడంతో బండారం బయటపడింది. దీంతో వారిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

More Telugu News