ఏపీ, తెలంగాణలు భారత్ లోనే ముందుండాలి: సీఎం చంద్రబాబు

24-05-2018 Thu 18:49
  • తెలంగాణలో ఉన్న మా కేడరే పార్టీకి బలం
  • ఎంతో చరిత్ర కలిగిన మన పార్టీని గెలిపించుకుందాం
  • తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశాం

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.  హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ, త్వరలో ఎన్నికలొస్తున్నాయి కనుక ప్రతీ కార్యకర్త కొండవీటి సింహంలా, బొబ్బిలిపులిలా పనిచేయాలని పిలపు నిచ్చారు. తమ స్వార్థం కోసం టీటీడీపీ నేతలు కొందరు పార్టీని వీడినా కార్యకర్తలు ఎప్పుడూ పార్టీతోనే ఉన్నారని ప్రశంసించారు. టీడీపీ పుట్టింది తెలంగాణ గడ్డపైనేనని, ఇక్కడ ఉన్న కేడరే పార్టీకి బలమని, ఎంతో చరిత్ర కలిగిన మన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపైనా ఉందని అన్నారు. తెలంగాణలో పార్టీని కాపాడుకుంటామని, ఏపీలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనేనని, తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశామని, నాడు పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసింది ఎన్టీఆరేనని, తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. సామాన్య ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోయిందని, దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.