Hyderabad: హైదరాబాద్ లో పాలిథీన్ కవర్లపై త్వరలో సంపూర్ణ నిషేధం!

  • తీర్మానాన్ని ఆమోదించిన జీహెచ్ఎంసీ
  • రాష్ట్ర ప్రభుత్వానికి నివేదన
  • కవర్లతో పట్టుబడితే రూ.25 వేల జరిమానా

భాగ్యనగరంలో పాలిథీన్ కవర్ల వినియోగం విచ్చలవిడిగా సాగిపోతుండడంతో కాలుష్యం పెనుసవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా కవర్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించే తీర్మానానికి నిన్న జరిగిన జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం ఆమోదం తెలియజేసింది. ఈ తీర్మానాన్ని జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. ఇది ఆమోదం పొందితే కవర్ల వినియోగాన్ని సమర్థంగా అరికట్టొచ్చని జీహెచ్ఎంసీ భావిస్తోంది.

పౌరులు, దుకాణదారులు, ఇతరులు ఎవరైనా గానీ పాలిథీన్ కవర్లను వినియోగిస్తే వారికి మొదటిసారి రూ.25 వేలు, రెండో సారి పట్టుబడితే  రూ.50 వేలు జరిమానా విధించాలన్నది ప్రతిపాదన. మూడోసారి కూడా ఉల్లంఘన జరిగితే సంబంధిత దుకాణాన్ని మూసేస్తారు. పాల ఉత్పత్తులకు, మొక్కల పెంపకానికి కవర్ల వినియోగానికి మినహాయింపు ఇవ్వనున్నారు. ఎగుమతుల కోసం కవర్లను సెజ్ లలోని యూనిట్లు తయారు చేసేందుకు అనుమతించారు.

More Telugu News