Ashwamedha Horse: ఆ గుర్రాన్ని కట్టేస్తానని అప్పుడే చెప్పా.. ఇప్పుడు చేసి చూపించా: కుమారస్వామి

  • మోదీ, షా వదిలిన అశ్వమేథ గుర్రాన్ని కట్టేశాం
  • 12 ఏళ్ల క్రితం బీజేపీ నన్ను వాడుకుంది
  • మమత పలు సూచనలు చేశారు

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విడిచిపెట్టిన అశ్వమేథ గుర్రాన్ని కర్ణాటకలో కట్టేశామని అన్నారు. పుష్కర కాలం క్రితం  బీజేపీ తనను వాడుకుందన్న సీఎం.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంతరం చెప్పిన మాటలను గుర్తు చేశారు. నరేంద్రమోదీ, షా వదిలిన అశ్వమేథ గుర్రాన్ని కట్టేయడమే తన లక్ష్యమని అప్పట్లో చెప్పానని, ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి గుర్రాన్ని పట్టుకుని కట్టేశాయని అన్నారు. జీవం కోల్పోయిన ఆ ఆశ్వం త్వరలోనే మోదీ వద్దకు చేరుకుంటుందని అన్నారు.

ఓ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇంతమంది నేతలు రావడం చరిత్ర అని కుమారస్వామి పేర్కొన్నారు. వారు తనకు మద్దతు తెలపడానికి మాత్రమే రాలేదని, 2019 ఎన్నికల్లో మార్పు తేవడానికే వారంతా వచ్చారని వివరించారు. దేశాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలపడం అనివార్యమని వారు చెప్పారని కుమారస్వామి తెలిపారు. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌తో చేతులు కలపడంపై జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడను మమత అభినందించారన్నారు. భవిష్యత్తులో తామెలా కలిసి పనిచేయాలన్న విషయంపై మమత పలు సూచనలు చేసినట్టు కుమారస్వామి వివరించారు.

More Telugu News