USA: 'ధ్వని' చేసిన గాయం... చైనాలోని అమెరికన్ అధికారికి విచిత్రమైన వ్యాధి!

  • విచిత్ర పరిస్థితుల్లో అధికారికి అనారోగ్యం
  • చైనాలోని అమెరికన్ రాయబార కార్యాలయంలో ఉద్యోగి
  • మెదడుకు గాయంతో తిరిగి అమెరికాకు
  • విచారణ జరిపిస్తున్నామన్న చైనా

చైనాలోని అమెరికన్ రాయబార కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారి విచిత్ర పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో, ఆ దేశంలోని తమ పౌరులందరికీ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ చైనా నగరమైన గువాంగ్ జోవులో యూఎస్ దౌత్య కార్యాలయంలో అధికారిగా ఉన్న వ్యక్తి అసాధారణమైన ధ్వని కారణంగా బ్రెయిన్ ఇంజ్యురీకి గురయ్యారు. ఈ ఘటనపై తాము విచారణ జరిపిస్తున్నామని చైనా వ్యాఖ్యానించింది. చైనాలో ఉంటున్న అమెరికన్లందరూ విధిగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా కోరింది.

ఈ ముందస్తు హెచ్చరికలకు, 2016లో క్యూబాలోని అమెరికన్లకు జారీ చేసిన హెచ్చరికలకు పోలిక లేదని యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చైనా కౌన్సిలర్ వాంగ్ యీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని తెలిపారు. వాంగ్ తో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, ఎందువల్ల అధికారి మెదడు గాయపడిందన్న విషయమై ఇరు దేశాలూ కలసి దర్యాఫ్తు చేస్తున్నాయని అన్నారు.

 ఇదే సమయంలో వాంగ్ మాట్లాడుతూ, తమ దేశంలోని ఏ సంస్థ లేదా వ్యక్తి ప్రమేయం ఇందులో ఉన్నట్టు ఇంతవరకూ తేలలేదని అన్నారు. కాగా, ప్రస్తుతం ఆ అధికారి అమెరికాలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు, ఆయన ఎంటీబీఐ (మైల్డ్ ట్రుమాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీ)తో బాధపడుతున్నారని తేల్చారు.

More Telugu News