Pawan Kalyan: 48 గంటల డెడ్ లైన్... చంద్రబాబు దిగిరాకుంటే నిరాహారదీక్ష!: పవన్ కల్యాణ్ వార్నింగ్

  • ప్రజలందరికీ రక్షిత మంచినీరు ఇవ్వాలి
  • రెండు రోజుల్లో వైద్య ఆరోగ్యమంత్రిని ప్రకటించాలి
  • లేకుంటే నిరాహారదీక్ష చేస్తానన్న పవన్

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

ఒకవేళ చంద్రబాబు దిగిరాకుంటే తన యాత్రను ఆపేసి, ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతానని, ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తనకు అధికారం లేకపోయినా సమస్యలపై స్పందిస్తున్నానని, అధికారంలో ఉన్నవారు స్పందించకుంటే ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి లేకపోవడం సిగ్గు చేటని, మంత్రిని నియమించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. హెల్త్ సెక్రటరీ ఈ విషయమై స్పందించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాను తాను దాటేలోపే కీలక నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు.

More Telugu News