IBC: మోదీ సర్కారు దెబ్బా? మజాకా... బ్యాంకులకు రూ. 83 వేల కోట్లు కట్టేశారు!

  • లోన్ డిఫాల్టర్లపై ప్రభావం చూపిన కొత్త దివాలా చట్టం
  • రుణాలను తిరిగి చెల్లించిన 2,100 కంపెనీలు
  • ప్రభుత్వ విజయమేనంటున్న ఆర్థిక నిపుణులు

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చర్యలకు, బ్యాంకులు రావని వదిలేసుకున్న రూ. 83 వేల కోట్లు వచ్చి పడ్డాయి. తమ సంస్థలపై చర్యలు తీసుకుంటారని, ఆస్తులను వేలం వేస్తారని భావించిన సుమారు 2,100 కంపెనీలు, గతంలో తాము తీసుకున్న రుణాలను సెటిల్ చేసుకునేందుకు ఆగమేఘాల మీద ప్రయత్నాలు జరిపి, తిరిగి చెల్లింపులు చేస్తున్నాయి. ఇదంతా కొత్తగా తీసుకొచ్చిన ఐబీసీ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాక్ రుప్టసీ కోడ్) పుణ్యమేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు.

 కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించిన తాజా గణాంకాల మేరకు, మొత్తం 2,100 కంపెనీలు తాము కట్టాల్సిన రుణాలను తిరిగి చెల్లించాయి. ఐబీసీ చట్టంలో మార్పుల తరువాత, ఎన్పీఏగా బ్యాంకులు ప్రకటించిన ఆస్తులపై ప్రమోటర్లకు ఎటువంటి హక్కులూ ఉండవన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 90 రోజుల పాటు రుణ చెల్లింపు ఆగిపోతే, ఆ రుణాన్ని, రుణం పొందేందుకు తనఖా పెట్టిన ఆస్తిని నిరర్థక ఆస్తి కింద ప్రకటించి తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని కొత్త చట్టం చెబుతోంది.

ప్రభుత్వం చట్టాన్ని మార్చిన తరువాత ఇస్సార్ కంపెనీని నడుపుతున్న రూయాలు, భూషణ్ గ్రూప్ యజమానులైన సింఘాల్ ఫ్యామిలీ, జేపీ అసోసియేట్స్ ను నిర్వహిస్తున్న గౌర్ కుటుంబం నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. "ప్రభుత్వం సాధించిన నిజమైన విజయం ఏంటంటే, లోన్ డిఫాల్టర్ల మీద ఒత్తిడి పెరిగింది. వారు రుణాలను తిరిగి చెల్లిస్తున్నారు. ఐబీసీ వల్లనే ఇదంతా సాధ్యమైంది" అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News