Yanamala: దక్షిణాదిపై పెత్తనం చెలాయించాలనుకుంది... కన్నడిగులు బుద్ధి చెప్పారు: యనమల

  • కర్ణాటకలో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలను అనుసరించింది
  • దక్షిణాదిపై పెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది
  • రానున్న రోజుల్లో పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి

కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని స్వాధీనం చేసుకొని... దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని బీజేపీ యత్నించిందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల అన్నారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుందని విమర్శించారు. అయితే, కర్ణాటక ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కర్ణాటకలో ఆ పార్టీ అనుసరించిన తీరు చాలా బాధాకరమని... భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని... ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు గాలి జనార్దన్ రెడ్డి చేసిన బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులపై విచారణ జరిపించాలని యనమల డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రధాన వ్యక్తులుగా ఏపీలో జగన్, కర్ణాటకలో గాలి మారారని దుయ్యబట్టారు. దక్షిణాదిలో ఆ పార్టీ అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని అన్నారు. 

More Telugu News