TTD: చట్టపరంగా ముందుకు వెళతాం: చంద్రబాబుతో భేటీ తరువాత టీటీడీ ఈవో

  • టీటీడీని కుదిపేస్తోన్న వివాదాలు
  • ఇప్పటివరకు జరిగిన వ్యవహారాలు సీఎంకు వివరణ
  • కొన్ని కొత్త అంశాలు బయటకు 
  • వివరించిన ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

టీటీడీని కుదిపేస్తోన్న వివాదాలపై పాలక మండలి అధికారులతో ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. టీటీడీ వ్యవహారాలపై చర్చించిన అనంతరం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు పలు విషయాలపై సీఎంకు వివరించామని అన్నారు.

టీటీడీ విషయంలో కొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చాయని వ్యాఖ్యానించారు. అన్ని అంశాలపై తాము చట్టపరంగానే ముందుకు వెళతామని చెప్పారు. దేవాలయ పవిత్రతకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారని ఆయన అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ముందుకు వెళ్లాలని అన్నారని తెలిపారు. టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పారు.

టీటీడీలోని కొన్ని నగలు మాయమయ్యాయంటూ వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, 1952 నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఏయే నగలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ ఉన్నాయని, రికార్డులో అన్ని వివరాలు ఉన్నాయని ఈవో అన్నారు. 1952 నుంచి రికార్డులన్నీ పరిశీలించామని, నగలన్నీ సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. 

More Telugu News