Tirupati: తిరుపతిలో అమిత్ షా పై దాడి కేసు... బీజేపీ నేత కోలా ఆనంద్ అరెస్ట్!

  • అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు రువ్విన టీడీపీ నిరసనకారులు
  • దాడిలో ధ్వంసమైన కోలా ఆనంద్ కారు అద్దాలు
  • ఆగ్రహంతో టీడీపీ నేతలపై దాడి
  • విచారణ తరువాత అరెస్ట్ చేసిన పోలీసులు

కర్ణాటక ఎన్నికలకు ముందు ప్రచారం ముగించుకుని తిరుమల వెంకన్న దర్శనానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చిన వేళ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిరసనకు దిగి, ఆయన కాన్వాయ్ పై రాళ్లదాడి చేసిన కేసు విచారణలో భాగంగా, టీడీపీ నేతలపై దాడికి దిగిన బీజేపీ నేత అరెస్టయ్యారు. అలిపిరి పోలీసులు కోలా ఆనంద కుమార్ ను, ఆయన అనుచరుడు బట్టవాటి రాజశేఖర్ ను తాజాగా అరెస్ట్ చేసి, వారిపై ఐపీసీ సెక్షన్ 341, 323, 506 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరిద్దరికీ న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు.

అమిత్ షా పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతూ, టీడీపీ నేతలు రాళ్లు విసరగా, అవి కోలా ఆనంద్ కారు అద్దాలను తాకాయి. కారు అద్దాలు పగలడంతో ఆయన, ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో టీడీపీ నేతలపై దాడి చేశారు. ఇరు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకోవడంతో, ఇప్పటికే టీడీపీ అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ నేత సుబ్రమణ్య యాదవ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, బీజేపీ నేత అరెస్ట్ కావడం గమనార్హం.

More Telugu News