NIPAH VIRUS: కేరళలో భయపెడుతున్న నిపా వైరస్... ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం

  • ఈ వైరస్ కు ఇప్పటికే 10 మంది బలి
  • వైద్య నిపుణులను పంపుతున్న కేంద్రం
  • నివారణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు కేరళ సీఎం ప్రకటన

కేరళలో నిపా వైరస్ వెలుగు చూడడంతో ఆ రాష్ట్రానికి కేంద్రం ఓ బృందాన్ని పంపిస్తోంది. కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జేపే నడ్డా ఫోన్లో మాట్లాడారు. నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ) డైరెక్టర్ ఆధ్వర్యంలో, ఎయిమ్స్, ఆర్ఎంఎల్ వైద్యులతో కూడిన బృందం ఈ రోజు కేరళకు చేరుకుంటుందని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం అందిస్తామని నడ్డా చెప్పారు. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. తాజాగా పెరంబ్ర తాలూకా హాస్పిటల్ కు చెందిన లిని (31) అనే నర్స్ మృతి చెందింది. నిపా వైరస్ బాధితులకు చికిత్స చేస్తూ ఆమె బలైపోయింది. అధిక జ్వరం కారణంగా కోజికోడ్ లో మరో ఐదుగురు మరణించగా, వారి లక్షణాలు ఈ వైరస్ ను పోలి ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ వైరస్ విషయంలో ఆందోళన చెందవద్దని, నివారణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 

More Telugu News