Srikakulam District: రైతన్నల పాదాలపై గాయాలు.. తన చేతులతో ముట్టుకుని పరిశీలించిన పవన్ కల్యాణ్!

  • చిత్తడి నేలల్లో రొయ్యల చెరువుల కారణంగా పెరిగిన వేడిమి
  • తమ పాదాలకు గాయాలు అయ్యాయని చూపించిన రైతులు
  • జీవితాలను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోనని పవన్ హెచ్చరిక

ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించుకునే అభివృద్ధి కావాలే తప్ప ప‌ర్యావ‌ర‌ణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధికి త‌మ పార్టీ వ్య‌తిరేక‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పష్టం చేశారు. తన పోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్యటిస్తున్న ఆయన, సోంపేటలోని రైతుల‌ను కలిశారు. జనసేన అధికారంలోకి వస్తే సోంపేట బీల భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇక్క‌డి చిత్త‌డి నేల‌ల్లో రొయ్య‌ల చెరువులు త‌వ్వ‌డం వ‌ల్ల ఉష్ణోగ్ర‌త‌లు పెరిగి తమ పాదాలు దెబ్బతింటున్నాయని రైతులు చెప్పగా, వారి పాదాలకు అయిన గాయాలను స్వయంగా పరిశీలించారు.

రైతులు వారిస్తున్నా వినకుండా, వారి పాదాలను తన చేతుల్లోకి తీసుకుని గాయాలను చూశారు. కొంతమంది నోట్ల క‌ట్ట‌ల‌ మీద ఆశ‌తో ఇంత మంది రైతుల జీవితాల‌ను నాశ‌నం చేస్తామంటే చూస్తూ ఉరుకోబోనని ఈ సందర్భంగా పవన్ హెచ్చరించారు. ఒక పధ్ధతి లేకుండా పర్యావరణాన్ని పాడు చేసేలా ప్ర‌భుత్వాలు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నాయని, ఆ తరువాత తాగ‌డానికి నీళ్లు, తిన‌డానికి తిండి కూడ దొరకని పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు. జ‌న‌సైనికులు సోంపేటలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించాలని పిలుపునిచ్చారు.

More Telugu News