Maharashtra: కేసీఆర్ సారూ... మేం తెలంగాణలో కలుస్తాం!: మహారాష్ట్ర గ్రామాల వినతి

  • అద్భుతంగా విజయవంతమైన 'రైతుబంధు'
  • తమకూ ఇటువంటి పథకం కావాలంటున్న మహారాష్ట్ర గ్రామీణులు
  • సాధ్యం కాదని తెలిసినా, గ్రామాలను కలుపుకోవాలని వేడుకోలు

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పలు గ్రామాల రైతులు, ఇప్పుడు తమ గ్రామాలను తెలంగాణలో కలుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వారు తమ స్వరాష్ట్రాన్ని వదులుకోవడానికి సిద్ధమై ఈ లేఖ రాశారు. తెలంగాణ సర్కారు ప్రారంభించిన 'రైతుబంధు' పథకమే వారి కోరికకు కారణం. తెలంగాణలో రైతులకు ఎకరాకు రెండు పంటలకు గాను రూ. 8 వేలను ఇస్తూ, కేసీఆర్ ప్రారంభించిన పథకం సూపర్ హిట్ కాగా, సరిహద్దు గ్రామాల్లోని రైతులు, తమకు కూడా రైతుబంధు కావాలని ఆశిస్తున్నారు. అదేమీ సాధ్యం కాదని తెలిసినా, తమ ఆశను కేసీఆర్ కు లేఖను రాయడం ద్వారా తెలియజేశారు.

దేశంలోనే ఇలా రైతులకు తిరిగి చెల్లించే అవసరం లేకుండా ధన సహాయం చేసే పథకాన్ని తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని దాదాపు 58 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద లాభం కలుగగా, ఇటువంటి పథకం తమకు దగ్గర కావాలంటే, తమ గ్రామాలను తెలంగాణలో కలపడం తప్ప మరో మార్గం లేదని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూక సర్పంచ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎంపీ కవితను కలిసిన బాబ్లీ గ్రామ సర్పంచ్ తమ సమస్యలు చెప్పుకుంటూ, తమ గ్రామాన్ని తెలంగాణలో చేర్చుకోవాలని కోరారు. ఇక మహారాష్ట్ర గ్రామీణుల కోరికపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News