YSRCP: వివాదంలో వైసీపీ నేత జోగి రమేష్: కొత్త ప్రేమజంటకు బెదిరింపులు?

  • కులాంతర వివాహం చేసుకున్న జంటకు బెదిరింపులు
  • ఆపై ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ఇంట్లో బంధించి, వారితో బలవంతంగా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ ప్రాంతానికి చెందిన తాళ్లూరి బుజ్జి (22), మైలవరం గ్రామానికి చెందిన నాగరాణి (19)లు, ఈ నెల 17న ప్రేమ వివాహం చేసుకుని ఆపై ఫెర్రీలోని బుజ్జి ఇంటికి వచ్చారు.

మరుసటి రోజు ఉదయం జడ రాంబాబు, బంక నాగరాజు, బాబూరావు, ముత్తి మల్లేశ్వరరావు తదితరులు, బుజ్జి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, వారిపై దౌర్జన్యం చేసి, ఆ కొత్త జంటను వైసీపీ నేత జోగి రమేష్‌ నివాసానికి బలవంతంగా తీసుకువచ్చారు. అక్కడ వారిని నిర్బంధించి, బెదిరింపులకు దిగారు. ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కొత్త జంట పోలీసులను ఆశ్రయించగా, ఐపీసీ సెక్షన్ 341, 384, 506 కింద కేసు నమోదు చేసినట్టు ఇబ్రహీంపట్నం సీఐ పవన్ కిషోర్ వెల్లడించారు. వారు సంతకాలు చేసిన ఖాళీ బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

More Telugu News