Tollywood: కారును ఢీకొట్టి.. ఆ పై బాధితుడిని బెదిరించిన దర్శకుడు బాబీ

  • ఆదివారం అర్ధరాత్రి ఘటన
  • పెద్దలతో పరిచయాలున్నాయని బెదిరింపులు
  • ఇంటికెళ్లి మాట్లాడుకుందామంటూనే జారుకున్న బాబీ

ఓ కారును తన కారుతో ఢీకొట్టడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించిన బాధితుడిని దర్శకుడు బాబీ బెదిరించాడు. తానో పెద్ద దర్శకుడినని, బోల్డంతమంది అధికారులు తెలుసని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు..

అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. అర్ధరాత్రి వారు ప్రయాణిస్తున్న కారు జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33 వరకు రాగానే, దర్శకుడు బాబీ కారు వెనక నుంచి వచ్చి హర్మిందర్ కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో హర్మిందర్ కారు వెనక భాగం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే కారు దిగిన బాధితుడు వెళ్లి బాబీని నిలదీశాడు. బాబీతోపాటు కారు దిగిన మరో ముగ్గురు హర్మిందర్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. తానో పెద్ద డైరెక్టర్‌ని అని, తనకు పలువురు పెద్దలతో సంబంధాలున్నాయని చెబుతూ, పక్కనే తన ఇల్లు ఉందని, కూర్చుని మాట్లాడుకుందామని అన్నాడు.  

అదే సమయంలో కారులో ఉన్న హర్మిందర్ తల్లి రీతు కౌర్‌కు చాతీలో నొప్పి రావడంతో ఆమెకు సపర్యలు చేస్తుండగా బాబీ అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు, ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలోనూ పోస్టు చేశాడు. రోడ్డు ప్రమాదం కారణంగా తన తల్లి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల పేర్లు చెప్పి బాబీ తనను బెదిరించాడని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు కూడా సరిగా స్పందించలేదన్నారు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News