Karnataka: సీఎం కావాలనుకున్నా.. కానీ ఇలా కాదు!: కుమారస్వామి

  • ప్రజలు నన్నెందుకు నమ్మడం లేదో
  • అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా సీఎం అవుతున్నా
  • పొత్తు ఎంతకాలం అనేది కాలమే నిర్ణయిస్తుంది

కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని కావాలని కలలు కనడం నిజమే కానీ, అది ఇలా కాదని వ్యాఖ్యానించారు. పూర్తి మెజారిటీతో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాలనుకున్నానని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో గద్దెనెక్కాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. కర్ణాటక ప్రజలు తనను ఎందుకు నమ్మడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి సీఎం పదవి చేపట్టాల్సి వచ్చిందని, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైందని వాపోయారు.

రాష్ట్ర ప్రజలు తనను విశ్వసించకపోవడం బాధగా ఉందని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, భావోద్వేగాలున్న మనిషినని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీల పాలన చూశారు కాబట్టి ఈసారి తనకు అవకాశం ఇస్తారనుకున్నానని కుమారస్వామి అన్నారు. అయితే, దురదృష్టవశాత్తు గతంలో కంటే తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు.  

దేశంలోని ఇతర ప్రాంతాలకు సందేశం ఇచ్చేందుకే కూటమి ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా కుమారస్వామి చెప్పుకొచ్చారు. పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు కుమారస్వామి స్పందిస్తూ.. అది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

More Telugu News