polavaram: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతాం: చంద్రబాబు

  • ఏపీని ఆదుకుంటామని అప్పట్లో మోదీ చెప్పారు
  • రాష్ట్రానికి కాంగ్రెస్‌ మోసం చేసిందని అన్నారు 
  • అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం
  • నాపై నమ్మకంతో నన్ను ప్రజలు గెలిపించారు

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా తురకలాపట్నంలో ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీని ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ చెప్పారని, రాష్ట్రానికి కాంగ్రెస్‌ మోసం చేసిందని తాము న్యాయం చేస్తామని అన్నారని పేర్కొన్నారు.

అందుకే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, తనపై నమ్మకంతో నన్ను ప్రజలు గెలిపించారని చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ 29 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఏపీ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
 
కాగా, రాష్ట్రంలో తాము రైతులకు అప్పుల నుంచి విముక్తి కలిగించామని, అనంతపురం జిల్లాలోనే సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.10 వేల కోట్లు వినియోగించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, నెలకు రూ.1000 చొప్పున పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.      

More Telugu News