Yeddanapudi Sulochana Rani: ఓ 'సెక్రటరీ', ఓ 'మీనా', ఓ 'జీవన తరంగాలు'... కాల్పనిక జగత్తులో తిరుగులేని నవలారాణి!

  • నవలా ప్రపంచం నుంచి రాలిన ధ్రువతార
  • మారుతున్న జీవన విధానాన్ని అనుసరించి రచనలు
  • ఎంతో మంది దర్శక, నిర్మాతలకు హిట్లిచ్చిన యద్దనపూడి నవలలు

తెలుగు నవలా ప్రపంచం నుంచి మరో ధ్రువతార రాలిపోయింది. తనదైన శైలిలో అరుదైన రచనలను చేసిన యద్దనపూడి సులోచనారాణి నవలల్లోని హీరో, ఆ తరం అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడేనని చెప్పవచ్చు. తనకు తారసపడిన జీవితాలనే కథా వస్తువుగా తీసుకుని నవలలు రాయడం ప్రారంభించిన యద్దనపూడి, ఆపై మారుతున్న ప్రజల జీవన విధానాలను అనుసరించి పాత్రలను సృష్టిస్తూ దూసుకెళ్లారు. ఆమె నవలలు భార్యాభర్తల మధ్య దాంపత్యం, కుటుంబ బాంధవ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మధ్య తరగతి అమ్మాయిల ఆత్మవిశ్వాసం, మాటకారితనంతో నిండి వుంటాయి. డబ్బున్న అబ్బాయి, పేదింటి అమ్మాయి మధ్య నెలకొనే ప్రేమ ఆధారిత నవలల సృష్టిలో యద్దనపూడి దిట్ట.

చదివే పాఠకులకు అద్యంతం ఆసక్తిని, ఉత్కంఠను కలిగించే యద్దనపూడి, 1965లో 'మనుషులు - మమతలు' చిత్రానికి కథను అందించగా, ఆపై ఎన్నో నవలలు సినిమాలుగా రూపొందించబడ్డాయి. ఆమె రాసిన ఎన్నో నవలలను ప్రముఖ దర్శక నిర్మాతలు, తమ సినిమాలకు కథగా తీసుకుని హిట్ సాధించారు. ఆమె చేతి నుంచి జాలువారిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, జై జవాన్, ఆత్మగౌరవం నవలలు చిత్రాలుగా రాగా, రాధ మధు నవల టీవీ ధారావాహికగా వచ్చింది. ఆమె రాసిన కీర్తి కిరీటాలు, అమృతధార, ఆభిజాత, గిరిజా కల్యాణం, ఆరాధన, అనురాగ గంగ, జాహ్నవి, నిశాంత, ప్రేమపీఠం, బంగారు కలలు, శ్వేత గులాబి, సౌగంధి, సుకుమారి వంటి నవలలను తెలుగు పాఠకలోకం ఎన్నడూ మరువదు.

More Telugu News