Trinamool congress: పశ్చిమబెంగాల్‌లో అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిందని.. మహిళకు దారుణ అవమానం!

  • మహిళ మెడలో బూట్ల దండ వేసి ఊరేగింపు
  • అసభ్య పదజాలంతో దూషణ
  • నిందితులపై చర్యలు తీసుకుంటామన్న జిల్లా అధ్యక్షుడు

పశ్చిమబెంగాల్‌లో ఓ మహిళకు దారుణ అవమానం జరిగింది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడం సంచలనమైంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిందన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తలు ఆమె మెడలో బూట్ల దండ వేసి ఊరంతా తిప్పి దారుణంగా అవమానించారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిందీ ఘటన.

ఈ నెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా బాగ్‌డుబి గ్రామంలో ఓ పోలింగ్ బూత్‌ను తృణమూల్ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. దీనిని గమనించిన మహిళ వారికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించింది. ఎన్నికలను ఎదుర్కోవడం ఇలా కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలని సవాలు చేస్తూ ధర్నా చేసింది. ఆమె స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తోందని భావించిన తృణమూల్ కార్యకర్తలు ఆమెను పార్టీ కార్యాలయానికి పిలిపించి అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడితో ఆగక ఆమె మెడలో బూట్ల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. రెండు చేతులతో చెవులను పట్టుకుని కూర్చోవాల్సిందిగా ఆదేశించారు.

మహిళను దారుణంగా అవమానించిన వీడియో బయటకు రావడంతో స్పందించిన జిల్లా పార్టీ నేతలు మహిళను అవమానించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, పార్టీ పెద్దల హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని సదరు కార్యకర్తలు.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఇటువంటి సత్కారాలు తప్పవని హెచ్చరించారు.

బాధిత మహిళ భర్త తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత కావడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సమిత్ దాస్ స్పందిస్తూ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News