Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణంగా పడిపోయిన ‘ఉల్లి’ ధరలు.. రైతుల ఆవేదన!

  • రైతుల నుంచి కిలో యాభై పైసలు- రూ.5 మధ్యలో కొనుగోలు 
  • ప్రభుత్వ నిర్వహణలోని హోల్ సేల్ మార్కెట్లలో ఈ పరిస్థితి
  • రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి ధర  ధర రూ.10  

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు దారుణంగా పడిపోయాయి. ఉల్లిపాయల నాణ్యతను అనుసరించి కిలో ధర యాభై పైసల నుంచి ఐదు రూపాయల మధ్య ఉంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలోని హోల్ సేల్ మార్కెట్లలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా నీముచ్ లోని ఉల్లిపాయల మార్కెట్ వ్యాపారి సమీర్ చౌదరి మాట్లాడుతూ, రైతుల వద్ద నుంచి కిలో యాభై పైసలు నుంచి ఐదు రూపాయల మధ్య ఉల్లిపాయలు నిన్న కొనుగోలు చేశామని చెప్పారు.

ఉల్లిపాయల నాణ్యత మేరకు ధర నిర్ణయించడం జరుగుతోందని అన్నారు. భోపాల్ కృషి ఉపాజ్ మండీ సమితి కార్యదర్శి వినయ్ ప్రకాష్ పటేరియా మాట్లాడుతూ, ఇక్కడి హోల్ సేల్ మార్కెట్ లో కిలో ఉల్లిపాయలను  రూ.2 నుంచి రూ.6 మధ్య విక్రయించినట్టు చెప్పారు. ఉల్లిపాయల నిల్వలు చాలా ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి పంట బ్రహ్మాండంగా పండిందని, గత రెండు రోజులుగా ఉల్లిపాయలను విక్రయించేందుకు రైతులు అధిక సంఖ్యలో వస్తున్నారని, మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని అన్నారు.

ఈ సీజన్ ముగిసే సమయానికి భోపాల్ లోని మార్కెట్ కు ఇరవై లేదా ఇరవై ఐదు క్వింటాళ్ల ఉల్లిపాయలు వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. తక్కువ నాణ్యత ఉన్న ఉల్లిపాయలను రైతులు తీసుకొస్తున్నారని, బహిరంగ మార్కెట్ లో మాత్రం నాణ్యత ఉన్న ఉల్లిపాయలను రైతులు విక్రయిస్తున్నారని చెప్పారు. కాగా,  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయల రిటైల్ ధర రూ.10 గా ఉందని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది జూన్ లో ఉల్లి పాయలకు కనీస మద్దతు ధర కల్పించాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జరిపిన పోలీస్ కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందారు.

More Telugu News