Chandrababu: చంద్రబాబు సూచనలు.. కుమారస్వామికి ఉపయోగపడ్డ వైనం!

  • క్యాంపు రాజకీయాలు ఎలా చేయాలో చెప్పిన చంద్రబాబు
  • ఎమ్మెల్యేలు స్థిరంగా ఉంటే రాజకీయాలను మార్చవచ్చు
  • దేశవ్యాప్త చర్చ జరిగేలా చూడండి
  • కుమారస్వామికి సలహాలు, సూచనలు ఇచ్చిన చంద్రబాబు

ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వారిని కాపాడుకోవడం ఎలా? క్యాంపు రాజకీయాలు ఎలా చేయాలి? గవర్నర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులను ఎలా ఆశ్రయించాలి? తదితరాంశాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడి అనుభవం జేడీఎస్ నేత కుమారస్వామికి ఉపయోగపడింది. ఎమ్మెల్యేలను ఓ చోట స్థిరంగా ఉంచగలిగితే రాజకీయాలను ఎలా మార్చవచ్చో గతంలో చేసి చూపించిన చంద్రబాబు, కుమారస్వామికి ఫోన్ చేసి మరీ సలహా సూచనలు ఇచ్చారు.

మెజారిటీ ఉన్న జేడీఎస్, కాంగ్రెస్‌ కూటమిని కాదని, బీజేపీని గవర్నర్‌ వాజూభాయ్, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించగానే, కుమారస్వామి, చంద్రబాబు ఫోన్‌ లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు కీలక సూచనలు చేస్తూ, ఎమ్మెల్యేలు జారిపోకుండా ఎలా చూసుకోవాలో, గవర్నర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం చేయాలో చెప్పారు. గవర్నర్‌ చేసిన తప్పిదంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చూడాలని, బిహార్‌, గోవా, మణిపూర్‌ లలో అత్యధిక స్థానాలు సంపాదించుకున్న పార్టీలు, ఆయా రాష్ట్రాల గవర్నర్లను ఒత్తిడిలోకి నెట్టేలా చూడాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇక చంద్రబాబు సూచనలతో రాజకీయం నడిపిన కుమారస్వామి, తమ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా చూడటంలో విజయం సాధించారు.

More Telugu News