Supreme Court: సుప్రీంలో బీజేపీకి ఊరట... ప్రొటెం స్పీకర్ గా బోపన్నే!

  • ప్రొటెం స్పీకర్ నియామకంపై గవర్నర్ ను ఆదేశించలేం
  • అర్హతపై విచారించాలంటే బలనిరూపణను వాయిదా వేయాల్సి వస్తుంది
  • పిటిషనర్లకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ విషయంలో యడ్యూరప్ప సర్కారు తొలి విజయం సాధించింది. సీఎం యడ్యూరప్పకు వీర విధేయుడని పేరున్న బోపన్నను ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‍, జేడీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సభలో మెజారిటీ నిరూపణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సినది ప్రొటెం స్పీకరే కావడంతో బోపన్న బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్నదే కాంగ్రెస్, జేడీఎస్ ఆందోళన.

పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం ప్రొటెం స్పీకర్ ను తాము ఎలా నియమిస్తామని ప్రశ్నించింది. ఫలానా వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని గవర్నర్ ను ఆదేశించే చట్టం లేదని స్పష్టం చేసింది. అయితే, సభలో సీనియర్ మోస్ట్ సభ్యుడినే ప్రొటెం స్పీకర్ గా నియమించే సంప్రదాయం ఉందని, పార్లమెంటరీ ప్రొసీజర్ కూడా అదే చెబుతోందని న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. ప్రొటెం స్పీకర్ అర్హతపై విచారించాలంటే సభలో బల నిరూపణను వాయిదా వేయాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. 

More Telugu News