Doctor: రకరకాల జబ్బుల పేరుతో రోగులను భయపెట్టి.. జెట్ విమానం కొనుక్కున్న వైద్యుడు.. చివరికి కటకటాల్లోకి!

  • తప్పుడు రోగ నిర్ధారణతో కోట్లకు పడగలెత్తిన వైద్యుడు
  • ఏకంగా బిజినెస్ విమానాన్ని కొనుగోలు చేసిన వైనం
  • దశాబ్దాల జైలు శిక్ష పడే అవకాశం

ఏ జబ్బూ లేకున్నా పెద్ద జబ్బు వుందని భయపెట్టి, రోగులకు ఖరీదైన వైద్యం చేసి ఆ డబ్బుతో జెట్ విమానం కొనుక్కుని దర్జాగా బతుకుతున్న ఓ వైద్యుడి బండారం బయటపడింది. అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌కు చెందిన డాక్టర్ జార్జ్ జమోరా-క్వెజాడా (61) రుమటాలజిస్ట్. ప్రస్తుతం 240 మిలియన్ డాలర్ల హెల్త్‌కేర్ అవినీతితోపాటు మనీలాండరింగ్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొని జైల్లో ఉన్నాడు.

జార్జ్ తన వద్దకు వచ్చే రోగులకు తప్పుడు వైద్య పరీక్షలతో భయపెట్టి ఫలానా జబ్బులున్నాయని చెప్పి ఖరీదైన చికిత్స చేసేవాడు. అవసరం లేకున్నా కీమోథెరపీతోపాటు టాక్సిక్ మెడిసన్స్ ఇచ్చేవాడు. తప్పుడు చికిత్స ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన జీవితం గడిపేవాడు. చిన్న, పెద్ద తేడా లేకుండా వేలాది మంది రోగులకు ఇటువంటి అవసరం లేని చికిత్స చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకోసం పేషెంట్ రికార్డులను తప్పుగా నమోదు చేసేవాడు.

తప్పుడు చికిత్సా విధానాలతో సంపాదించిన కోట్లాది రూపాయలతో ఆరు సీట్ల ఎక్లిప్స్ 500 బిజినెస్ జెట్‌ను కొనుగోలు చేశాడు. దీంతోపాటు ఖరీదైన కార్లు, దుస్తులు కొనుగోలు చేశాడు. వీటి విలువ 50 మిలియన్ డాలర్లు.

జార్జ్ వద్ద చికిత్స చేయించుకున్న ఓ మహిళ మాట్లాడుతూ తనకు ఆర్థరైటిస్ ఉందని చెప్పి ఇంజెక్షన్లు ఇచ్చేవాడని, మోకాలికి అవి ఎంతగానో సహాయపడతాయని చెప్పాడని, అయితే ఆ చికిత్స వల్ల తనకు ఇసుమంతైనా లాభం చేకూరలేదని పేర్కొంది. తన కాలులో మార్పులు రావడంతో తిరిగి ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్తే ఆయన తనకసలు ఆర్థరైటిస్ లేదని చెప్పాడని పేర్కొంది.

తాను కీళ్ల నొప్పులతో ఈ వైద్యుడి వద్దకు వెళ్తే, తనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని చెప్పాడని రేమండ్ ఓర్టా అనే మరో రోగి తెలిపాడు. దీంతో తనకు ఖరీదైన కెమో-లెవల్ డ్రగ్స్ ఇచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు.

పలు నేరారోపణలు ఎదుర్కొంటున్న జార్జ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జూలై 2న తదుపరి విచారణ జరగనుంది. నేరం రుజువైతే జార్జ్‌కు దశాబ్దాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

More Telugu News