Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపుకు ‘శర్మ’ బస్సులు.. కారణం తెలుసా?

  • శర్మ ట్రావెల్స్ సంస్థ యజమాని డీపీ శర్మ
  • కాంగ్రెస్ పార్టీకి  విశ్వాసపాత్రుడు
  • అందుకు, ఆ సంస్థ బస్సులనే కాంగ్రెస్ వినియోగిస్తోంది!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ రేపు బలనిరూపణ చేసుకోనుంది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు, బీజేపీ ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలను కాంగ్రెస్-జేడీఎస్ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండుమూడు రోజుల నుంచి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను హోటళ్లు, రిసార్టులకు తిప్పుతున్నాయి.

ఇందుకుగాను శర్మ ట్రావెల్స్ కు చెందిన టూరిస్ట్ బస్సులను మాత్రమే కాంగ్రెస్ వినియోగిస్తోంది. తమ ఎమ్మెల్యేలను ఈరోజు హైదరాబాద్ కు తరలించింది కూడా ఈ సంస్థ బస్సుల్లోనే! ‘శర్మ’ బస్సులనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎందుకు వినియోగిస్తోందనే దానిపై పలువురికి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సంస్థ బస్సులను ‘కాంగ్రెస్’ వినియోగించడానికి గల కారణం ఆసక్తిదాయకం.

 కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడు డీపీ శర్మ

శర్మ ట్రావెల్స్ సంస్థ యజమాని డీపీ శర్మ. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కూడా. ఈ రంగంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని, విశ్వాసపాత్రుడైన ఆయన 1980 లలో రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారు. 1998లో దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో సన్నిహితంగా మెలిగే వారు.

రాజస్థాన్ కు చెందిన డీపీ శర్మ 2001లో మృతి చెందారు. ఆ తర్వాత ఈ సంస్థ బాధ్యతలను ఆయన కుమారుడు సునీల్ కుమార్ శర్మ చేపట్టారు. ఈ సంస్థకు చెందిన లగ్జరీ బస్సులు బెంగళూరు నుంచి పలు ప్రాంతాలకు నడుపుతున్నారు. మన దేశంలో మొట్టమొదటసారిగా లెక్సియా, వోల్వో బస్సులను ప్రవేశపెట్టింది శర్మ ట్రావెల్సే. ఈ సంస్థ బస్సులు హైదరాబాద్, చెన్నై, గోవా, ముంబై, పుణె తదితర ప్రాంతాలకు నడుపుతుండటం గమనార్హం. 

More Telugu News