H1B Visa: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అండగా 130 మంది యూఎస్ చట్టసభ సభ్యులు

  • హెచ్4 వీసాలను రద్దు చేస్తామన్న ట్రంప్ ప్రభుత్వం
  • 70 వేల మంది హెచ్4 వీసాదారుల్లో గుబులు
  • ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 130 మంది చట్టసభ సభ్యులు

అమెరికా వెళ్లి, 'హెచ్1బీ' వీసా సంపాదించి అక్కడే స్థిరపడాలన్నది అక్కడకు వెళ్లే ప్రతి ఒక్కరి కల. అయితే ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం అలా ఆలోచిస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. దేశంలో విదేశీయులకు క్రమంగా ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తోంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామనే నినాదంతో అధికారం చేబట్టిన ట్రంప్, చెప్పినట్లుగానే అన్నంత పనీ చేస్తున్నారు.

గతంలో ఒబామా ప్రభుత్వం 'హెచ్1బీ' వీసాదారుల భార్యలకు, దగ్గరి బంధువులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వారి కోసమే అప్పట్లో ఒబామా ప్రభుత్వం ప్రత్యేకంగా 'హెచ్4' వీసాను కూడా మంజూరు చేసింది. అయితే తాజాగా 'హెచ్4' వీసాదారులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. వారికి అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం లేకుండా చేస్తోంది. గతంలో ఒబామా ప్రభుత్వం హెచ్4 వీసాదారుల కోసం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తామని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దాంతో 70 వేల మంది హెచ్4 వీసాదారుల్లో గుబులు మొదలైంది.

అమెరికాలో నివసిస్తున్న వలసదారులతోపాటు, పలువురు చట్టసభ సభ్యులు కూడా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు ఇటీవల డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన 130 మంది చట్టసభ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, భారత సంతతి మహిళ అయిన ప్రమీల జయపాల్ అధ్యక్షత వహించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చట్టసభ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ విషయంపై వారు అమెరికా భద్రతా కార్యదర్శి క్రిస్టిజైన్ నెల్సన్‌కు లేఖ రాశారు. హెచ్4 వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే మానవ వనరుల కొరత ఏర్పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని వారు లేఖలో పేర్కొన్నారు. హెచ్4 వీసాదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, వారందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తే వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటాయని వారు తెలిపారు. వచ్చే నెల జూన్ నుంచి అమలు చేయాలనుకుంటున్న ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చట్టసభ సభ్యులు కోరుతున్నారు. కాగా, హెచ్4 వీసాదారుల్లో 93శాతం మంది భారతీయులే ఉండటం గమనార్హం.

More Telugu News