telenor and airtel merged: ఎయిర్ టెల్ లో కలిసిపోయిన టెలినార్... ఇంటిముఖం పట్టనున్న 700 మంది ఉద్యోగులు

  • విలీనం తర్వాత తగిన ఉద్యోగాలు లేవంటున్న ఎయిర్ టెల్
  • 1,400 మంది టెలినార్ ఉద్యోగుల్లో 700 మందికి వివిధ బాధ్యతలు
  • మిగిలిన వారిని హెచ్ ఆర్ ముందు హాజరు కావాలని ఈ మెయిల్స్

టెలినార్ ఎట్టకేలకు ఎయిర్ టెల్ లో కలసిపోయింది. ఇది జరిగిన మరుసటి రోజే ఇప్పటి వరకు టెలినార్ లో ఉద్యోగులుగా ఉన్న వారికి షాక్ కు గురిచేసే ఈ మెయిల్స్ వచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగించే లక్ష్యంతో పంపిన మెయిల్స్  కావడంతో వారిలో ఆందోళన మొదలైంది. హెచ్ ఆర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని ఎయిర్ టెల్ కోరింది.

ఏం చేయాలన్నది సమావేశంలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. ఎయిర్ టెల్ దీన్ని ధ్రువీకరించింది. టెలినార్ లో ఉన్న ఉద్యోగులు అందరికీ ఎయిర్ టెల్ లో తగిన ఉద్యోగాలు లేవని స్పష్టం చేసింది. టెలినార్ కు ఉన్న 1,400 మంది ఉద్యోగుల్లో 700 మందిని సర్దుబాటు చేసుకున్నట్టు తెలిపింది. అంటే మరో 700 మందిని సాగనంపుతున్నట్టు పరోక్షంగా అంగీకరించినట్టయింది.

ఈ నెల 14న టెలికం శాఖ ఎయిర్ టెల్-టెలినార్ విలీనానికి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఎయిర్ టెల్ పంపిన ఆదేశంతో సమావేశానికి హాజరైన ఓ ఉద్యోగి జరిగిన వ్యవహారాన్ని మీడియాకు వెల్లడించారు. విలీనం అనంతరం తన బాధ్యతలకు తగ్గ ఉద్యోగం లేదన్నారని తెలిపారు. ఐదు నెలల వేతనం ఇవ్వజూపుతూ రాజీనామా చేయాలని కోరినట్టు వెల్లడించారు. 

More Telugu News