Mumbai Indians: అలా రాసిపెట్టి ఉంది... జరిగింది: రవిచంద్రన్ అశ్విన్

  • గత రాత్రి మ్యాచ్ లో ఓడిపోయిన అశ్విన్ టీమ్
  • బ్యాటింగ్ లో సమస్యలున్నాయన్న కెప్టెన్
  • తదుపరి మ్యాచ్ లో గెలుస్తామన్న ధీమా

పది బంతుల్లో 20 పరుగులు చేస్తే విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విఫలమైన వేళ, మీడియా సమావేశంలో జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, తమ ఓటమి రాసిపెట్టి ఉందని, బ్యాట్స్ మెన్ల వైఫల్యం వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయామని వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ, తమకు ప్లే ఆఫ్ తలుపులు తెరచుకునే ఉన్నాయని, తదుపరి మ్యాచ్ లో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని అన్నాడు.

కాగా, వరుస విజయాలతో దూసుకొచ్చి, టైటిల్ గెలుచుకునే సత్తా ఉన్న జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న పంజాబ్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. తొలుత రాజస్థాన్ రాయల్స్ చేతిలో, ఆపై కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయారు. "మా బ్యాటింగ్ లో సమస్యలు ఉన్నాయి. నిజాయతీగా చెప్పాలంటే చాంపియన్ సాధించే జట్టు చూపాల్సినంత ఆటను మేము చూపడం లేదు. మా బలాన్ని పూర్తిగా చూపడంలో వైఫల్యం చెందాం. ముంబైతో మ్యాచ్ లో ఈ పరిస్థితి వస్తుందని భావించలేదు. ముంబై బ్యాటింగ్ చేస్తున్న వేళ, డెత్ ఓవర్లలో 20 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. మరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మేము 14 పాయింట్లతో నిలుస్తామనే భావిస్తున్నాం" అని అన్నాడు.

More Telugu News