Bank of England: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవి వద్దు: రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

  • వచ్చే సంవత్సరం జూన్ లో ఖాళీ కానున్న బీఓఈ గవర్నర్ పోస్టు
  • తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసిన రఘురాం రాజన్
  • కనీసం దరఖాస్తు కూడా చేయబోవడం లేదని వెల్లడి

వచ్చే సంవత్సరం ఖాళీ అయ్యే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవిని చేపట్టాలన్న ఆలోచన తనకు లేదని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవి కోసం దరఖాస్తు చేయాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కెనడా సెంట్రల్ బ్యాంక్ హెడ్ గా పనిచేసి, ఆపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా వచ్చిన మార్క్ కార్నే జూన్ 2019లో పదవీ విరమణ చేయనుండగా, ఆయన వారసుడిగా రాజన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

"ప్రస్తుతం షికాగో యూనివర్శిటీలో నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను. నాకు బోధించడమంటేనే ఇష్టం. నేనేమీ నిష్ణాతుడినైన బ్యాంకర్ ను కాదు. ఇక్కడ నాకు ఆనందంగా ఉంది" అని యూఎస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్, లండన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను చెప్పగలిగింది ఇంతేనని, తాను మరెక్కడా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే పరిస్థితి లేదని రఘురాం రాజన్ అన్నారు.

కాగా, బ్రిటన్ ఆర్థికమంత్రి ఫిలిప్ హమాండ్ ఇటీవల మాట్లాడుతూ, ఈ సంవత్సరమే కార్నే వారసుడి ఎంపిక ఉంటుందని, ఈ పోస్టుకు విదేశీయుల పేర్లను కూడా పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించిన తరువాత రఘురాం రాజన్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుకు బ్యాంక్ ఆఫ్ ఇంటర్నెేషనల్ సెటిల్ మెంట్స్ జనరల్ మేనేజర్ అగస్టిన్ కార్స్ టెన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాజీ డిప్యూటీ గవర్నర్ మినౌచ్ షఫీక్,  స్టాండర్డ్ యూకే చైర్మన్ శృతీ వదేరా పేర్లు వినిపిస్తున్నాయి.

More Telugu News