Mumbai Indians: వెంట్రుకవాసిలో ఓటమిని తప్పించుకుని ప్లే ఆఫ్ రేసులోకి ముంబై ఇండియన్స్!

  • ముంబై చేతిలో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్
  • ముంబైని ఆదుకున్న పొలార్డ్, బుమ్రా
  • ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఇరు జట్లు

గత రాత్రి ముంబైలోని వాంఖడే మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన అత్యంత కీలకమైన పోరులో ముంబై ఇండియన్స్ వెంట్రుకవాసిలో ఓటమి నుంచి బయటపడింది. ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోయివుంటే ప్లే ఆఫ్ రేసు నుంచి బయటకు వచ్చినట్టే. పంజాబ్ జట్టు ఓడినా రేసులోనే ఉంటుంది. ఇటువంటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది.

187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 94 పరుగులు సాధించినా, పంజాబ్ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. చివరి 10 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన తరుణంలో లోకేష్ రాహుల్ అవుట్ కావడంతో ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ జట్టు ఓటమిపాలైంది. కీలక సమయంలో పొలార్డ్ చేసిన 50 పరుగులు (23 బంతుల్లో), ఆపై బుమ్రా బాల్ తో చేసిన మ్యాజిక్ ముంబైని మరో మెట్టు ఎక్కించాయి.

ఇక పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై జట్టు తన చివరి మ్యాచ్ ని ఢిల్లీతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో విజయం ముంబై జట్టుకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబై మరో సమీకరణంతో అవసరం లేకుండా ప్లే ఆఫ్ కు చేరుతుంది. ఇక ఓడిపోతే మాత్రం ఇతర జట్ల జయాపజయాలు ముంబై అవకాశాలపై ప్రభావం చూపుతాయి.

More Telugu News