yesudasu: 'రూమ్ సర్వీస్' అంటూ ఏసుదాసుకి భోజనం తీసుకెళ్లాను .. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు!: బాలసుబ్రహ్మణ్యం

  • ఒకసారి కచేరి నిమిత్తం పారిస్ వెళ్లాము 
  • నేను హోటల్ ఫుడ్ తినను 
  • ఏసుదాసు గారికి భోజనం పంపడం మరిచిపోయారు     

ఒక వైపున సినిమా పాటలు .. మరో వైపున భక్తి గీతాలు పాడుతూ, స్టేజ్ షోలు ఇస్తూ ఏసుదాసు .. బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటూ వుంటారు. తమ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం ఇలా చెప్పుకొచ్చారు. "ఒకసారి మేం 'పారిస్' లో కచేరి చేయడానికి వెళ్లాము. ఎప్పుడూ ఏసుదాసు గారి భార్య ఆయనతో పాటు వచ్చేవారు .. కానీ ఆ సారి మాత్రం ఆవిడ రాలేదు. నేను .. నా భార్య కలిసి వెళ్లాం"

"ఏసుదాసు గారికి .. నాకు ఒకే హోటల్లో పక్కపక్కనే గల రూములు ఇచ్చారు. నేను శాకాహారిని కావడం వలన బయట ఊళ్లకి వెళ్లినప్పుడు భోజనం ఇబ్బంది అవుతుందని కుక్కర్ .. పచ్చళ్లు .. పొడులు తీసుకెళుతుంటాను. అలా హోటల్ ఫుడ్ తో పని లేకుండా ఏర్పాటు చేసుకునేవాడిని. కచేరి అయిన తరువాత రాత్రికి ఇద్దరం ఎవరి రూముకు వాళ్లం చేరుకున్నాం. నాకు భోజనం రెడీగా వుంది .. నిర్వాహకులు ఆయనకి భోజనం పంపించారా? అనే సందేహం వచ్చింది. వాళ్లకి ఫోన్ చేస్తే నీళ్లు నమిలారు"

"అంతే.. నేను కంచంలో అన్నం కలుపుకుని వెళ్లి .. 'రూమ్ సర్వీస్' అంటూ తలుపుకొట్టాను. ఆయన వచ్చి తలుపు తీసి .. 'ఏంటయ్యా ఇదంతా' అంటూ ఆశ్చర్యపోయారు. నిర్వాహకులు భోజనం ఏర్పాటు చేయడం మరిచిపోయారని చెప్పాను. తర్వాత నేను తీసుకెళ్లిన భోజనం తింటూ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నారు.

"జీవితంలో ఎన్నో దేవాలయాలకి తిరిగాను .. ఇంత చక్కని ప్రసాదం ఇంతవరకూ నాకు ఎక్కడా దొరకలేదు" అన్నారు. ఆ రోజు నుంచి మరింత దగ్గరయ్యాము .." నా తమ్ముళ్ల కంటే ఎవరు ఎక్కువంటే .. బాలసుబ్రహ్మణ్యం" అని ఆయన చాలా వేదికలపై చెప్పారు" అని అన్నారు.   

More Telugu News