ప్రకాశ్ జవదేకర్ ఎవరు?.. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు!: కుమారస్వామిగౌడ సంచలన వ్యాఖ్యలు

16-05-2018 Wed 13:33
  • ఉత్తరాదిన బీజేపీ అశ్వమేధ యాగం ప్రారంభమైంది.. కర్ణాటకలో వారి గుర్రాలు ఆగిపోయాయి
  • బీజేపీ ఒక్క ఎమ్మెల్యేను లాగే ప్రయత్నం చేసినా.. మేము ఇద్దర్ని లాగుతాం
  • గుర్రాల వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా గవర్నర్ వ్యవహరించరాదు

బీజేపీపై జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమారస్వామి నిప్పులు చెరిగారు. బీజేపీకి మద్దతు ఇచ్చే జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లతో పాటు, మంత్రి పదవిని ఆ పార్టీ ఆఫర్ చేస్తోందని మండిపడ్డారు. ఇంత నల్లధనం వారికి ఎక్కడ నుంచి వస్తోందని ప్రశ్నించారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్కడున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రయత్నించాయని... కానీ, తాను బీజేపీతో కలసి వెళ్లబోనని ఆయన చెప్పారు. 2004, 2005లో బీజేపీతో కలసి వెళ్లాలని తాను తీసుకున్న నిర్ణయం వల్ల తన తండ్రి దేవెగౌడకు మచ్చ వచ్చిందని... ఆ మచ్చను తొలగించుకునే అవకాశం ఇప్పుడు తనకు వచ్చిందని అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ తో కలసి వెళ్తున్నానని చెప్పారు.

బీజేపీ చేపట్టిన అశ్వమేధ యాగం ఉత్తరాదిన ప్రారంభమైందని... కర్ణాటకలో వారి గుర్రాలు ఆగిపోయాయని కుమారస్వామి ఎద్దేవా చేశారు. అశ్వమేధ యాగాన్ని ఆపేయాలనే విషయాన్ని కర్ణాటక ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయని అన్నారు. ఆపరేషన్ 'కమలం' విజయవంతమైందనే విషయాన్ని మర్చిపోవాలని... బీజేపీని వదిలి, తమతో కలసి వచ్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను లాగే ప్రయత్నం చేసినా... తాము ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను లాగేస్తామని హెచ్చరించారు. గుర్రాల వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరించవద్దని గవర్నర్ ను కోరుతున్నానని చెప్పారు. బీజేపీ కర్ణాటక ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ ను కలిశారా? అనే ప్రశ్నకు బదులుగా... ప్రకాశ్ జవదేకర్ ఎవరు? అని ఎదురు ప్రశ్నించారు. ఇవన్నీ బోగస్ వార్తలని... జవదేకర్ కానీ, మరే ఇతర బీజేపీ నేత కానీ తనను ఇంత వరకు కలవలేదని చెప్పారు. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరతో కలసి గవర్నర్ ను మరోసారి కలుస్తానని అన్నారు.