Karnataka election results: కాంగ్రెస్ కు ఓట్లు... బీజేపీకి సీట్లు... ఆ లెక్కల వివరాలు ఇవిగో!

  • 38 శాతం ఓట్లతో కాంగ్రెస్ మొదటి స్థానం
  • 36.2 శాతంతో బీజేపీ, 18.4 శాతం ఓట్లతో జేడీఎస్ కు తర్వాతి స్థానాలు
  • అయినా 104 సీట్లతో బీజేపీ నంబర్ 1
  • 78 సీట్లతో నంబర్ 2 గా కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఆశ్చర్యపరిచే అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో మొదటిది అత్యధిక ఓట్లు కాంగ్రెస్ కే పడడం. ఇక్కడ కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు వచ్చాయి. అంటే మొత్తంగా 1,36,93,220 ఓట్లు పడ్డాయి. కానీ సీట్లు మాత్రం 78 దగ్గర ఆగిపోయాయి. అటు బీజేపీకి పడిన ఓట్ల శాతం 36.2 శాతం. వచ్చిన మొత్తం ఓట్లు 1,30,52,584. కానీ బీజేపీకి వచ్చిన సీట్లు మాత్రం 104.

ఈ రెండు పార్టీల మధ్య 1.8 శాతం ఓట్ల తేడా ఉంది. అయినప్పటికీ తక్కువ ఓట్ల శాతంతో బీజేపీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడం గమనార్హం. అటు జేడీఎస్ కు వచ్చిన ఓట్లు 18.4 శాతం (66,40,258). బీజేపీ 2013తో పోల్చుకుంటే 64 స్థానాలు పెంచుకుంది. కాంగ్రెస్ 44 స్థానాలు కోల్పోయింది. జేడీఎస్ సైతం 3 స్థానాలు నష్టపోయింది. ఇతరులు గతంలో 22 మంది ఉండగా, ఈ సారి ముగ్గురికి పరిమితం అయ్యారు.

మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, 2013 నాటి కంటే బీజేపీ 16.3 శాతం ఓట్లను పెంచుకోవడం. 2013లో కమలానికి వచ్చిన ఓట్ల శాతం 19.9. కానీ, తాజాగా 36.2 శాతం ఓట్లకు ఎగబాకడం అధిక సీట్ల కైవసానికి తోడ్పడింది. అటు కాంగ్రెస్ కూడా 2013లో 36.6 శాతం ఓట్లు సాధించగా, తాజాగా 38 శాతానికి పెంచుకుంది. అయినా అధికారానికి దూరమైంది. జేడీఎస్ ఓటు బ్యాంకు 20.2 శాతం నుంచి తాజాగా 18.3 శాతానికి పరిమితమైంది.

More Telugu News